Police: సంగారెడ్డి జిల్లాలో నడిరోడ్డుపై కారు డ్రైవర్ ను చితకబాదిన పోలీసులు

  • సదాశివపేటలో వాహనాల తనిఖీ
  • వాజిద్ అనే వ్యక్తి కారును తనిఖీ చేసిన పోలీసులు
  • వెళ్లిపోవాలని చెప్పడంతో కారు ముందుకు పోనిచ్చిన వాజిద్
  • మళ్లీ ఆపాలని కోరిన పోలీసులు
  • అయినప్పటికీ ముందుకు పోతావా అంటూ పోలీసుల ఆగ్రహం
  • కారు లోంచి లాగి వాజిద్ పై దాడి
Police attack on a car driver in Sadasivapet

సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ఓ కారు డ్రైవర్ పై పోలీసులు విరుచుకుపడ్డారు. వాహనాల తనిఖీ సందర్భంగా వాజిద్ అనే వ్యక్తి కారును కూడా పోలీసులు తనిఖీ చేశారు. తనిఖీ అనంతరం వెళ్లిపొమ్మని చెప్పడంతో వాజిద్ తన కారును ముందుకు పోనిచ్చాడు. అంతలోనే మళ్లీ అతని కారును ఆపాలని పోలీసులు ఆదేశించారు. అయితే, ఆ విషయాన్ని సరిగ్గా అర్ధంచేసుకోని వాజిద్ తన కారును ముందుకు పోనివ్వడంతో పోలీసులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. తాము ఆపమంటే ఆగకుండా వెళతావా అంటూ అతడిని కారు నుంచి బయటికి లాగి నడిరోడ్డుపై విచక్షణ రహితంగా కొట్టారు.

ఓ కానిస్టేబుల్, మరో హోంగార్డు కలసి ఆ కారు డ్రైవర్ ను కొడుతున్న దృశ్యాలను కొందరు వీడియోలో రికార్డు చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో జిల్లా పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. డీఎస్పీ బాలాజీ మాత్రం పోలీసులను సమర్థించే ప్రయత్నం చేశారు. వాజిద్ తన వాహనాన్ని ఓ పోలీసు కానిస్టేబుల్ కు తగిలేలా నడిపాడని ఆరోపించారు. అతడిని స్థానికులే కొట్టారని తెలిపారు.

అయితే, జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ఈ ఘటనను ఖండించారు. కారు డ్రైవర్ వాజిద్ పై దాడికి పాల్పడిన కానిస్టేబుల్ రాములు, హోంగార్డు బాలరాజులను సస్పెండ్ చేశారు. ఏఎస్సై దుర్గయ్య, కానిస్టేబుల్ ప్రసాద్ లను హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేశారు. కాగా ఈ ఘటన నేపథ్యంలో పోలీసుల తీరుపై సదాశివపేట ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News