Electric Vehicles: విద్యుత్​ వాహనాల తయారీకి కేంద్రం ప్రోత్సాహకాలు!

  • 800 కోట్ల డాలర్ల మేర ఇన్సెంటివ్ లు ఇవ్వాలని యోచన
  • సంస్థలకు 9 శాతం దాకా క్యాష్ బ్యాక్ స్కీమ్
  • 1400 కోట్ల డాలర్ల పెట్టుబడులే టార్గెట్ గా నిర్ణయం
India to launch supercharged push for global electric vehicle players

ఓ వైపు పెరిగిపోతున్న కాలుష్యం.. భగ్గుమంటున్న పెట్రోల్ ధరలు.. వీటి నుంచి బయటపడేదెలా? దానికి ఇప్పటికే ప్రపంచ దేశాలు ఓ పరిష్కారాన్ని కనిపెట్టాయి. కొన్ని దేశాలు దానిని అమలు చేస్తున్నాయి. అదే విద్యుత్ వాహనాల వాడకం. మన దేశంలోనూ ఇప్పటికే చాలా మందికి దానిపై అవగాహన వచ్చింది. కొన్ని కంపెనీలు విద్యుత్ వాహనాలను తయారు చేస్తున్నాయి. మార్కెట్ లోకి వచ్చాయి. ఈ క్రమంలోనే వాటిని మరింతగా పెంపొందించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది.

కాలుష్యాన్ని తగ్గించి, శిలాజ ఇంధనాల వాడకం (పెట్రోల్, డీజిల్ )పై ఆధారపడడం తగ్గించుకునేందుకు విద్యుత్ వాహనాల తయారీకి కంపెనీలను ప్రోత్సహించాలని భావిస్తోంది. ప్రస్తుతం దేశంలో వాటి తయారీ చాలా తక్కువగా ఉండడంతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించింది. వివిధ దేశాల నుంచి 1400 కోట్ల డాలర్ల పెట్టుబడులే లక్ష్యంగా పెట్టుకుని ఓ దార్శనిక పత్రాన్ని తయారు చేసినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా విద్యుత్ వాహనాలను తయారు చేసే సంస్థలు, పంపిణీదారులకు 800 కోట్ల డాలర్ల ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

మరో నెలలో ఆ పథకానికి సంబంధించిన తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని సమాచారం. ఏప్రిల్ 1 నుంచి సంస్థలు ఆ ప్రోత్సాహకాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటును కల్పించినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. మామూలుగా అయితే సంస్థలకు వాహనాలు, వాటి విడి భాగాలపై ప్రభుత్వం 4 నుంచి 7 శాతం వరకు క్యాష్ బ్యాక్ ఇన్సెంటివ్ లను ఇస్తోంది. విద్యుత్ వాహనాలకు మాత్రం అదనంగా మరో 2 శాతం ఇవ్వనున్నట్టు చెబుతున్నారు.

విద్యుత్ వాహనాల తయారీని భారత్ లో ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నా.. అధిక వడ్డీ రేట్లు, విద్యుత్ టారిఫ్ లు, సరిగ్గా లేని మౌలిక వసతులు, అధికమైన రవాణ ఖర్చు వంటి విషయాలు కంపెనీలకు భారంగా పరిణమిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వివిధ దేశాల నుంచి 1400 కోట్ల డాలర్ల పెట్టుబడులను ఆశిస్తోంది. 58 లక్షల ఉద్యోగాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

అయితే, పథకం ద్వారా కంపెనీలు లబ్ధి పొందాలంటే ఆయా సంస్థలకు ప్రపంచ వ్యాప్తంగా 140 కోట్ల డాలర్ల రెవెన్యూ ఉండి ఉండాలని పేర్కొన్నట్టు సమాచారం. విడి భాగాల తయారీ సంస్థలకైతే 6.9 కోట్ల డాలర్ల ఆదాయం ఉండి ఉండాలి. ఆయా సంస్థలు ఏటా కనీసం 8 శాతం వృద్ధిని నమోదు చేయాలి. కాగా, ఈ స్కీమ్ ద్వారా ప్రభుత్వం కూడా ఏటా పన్నుల రూపంలో 400 కోట్ల డాలర్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని భావిస్తోంది.

More Telugu News