India: భారత్‌-పాక్ శాంతి ఒప్పందం వెనుక ఉన్నది ఎవరో తెలుసా?

  • గత నెలలో భారత్, పాకిస్థాన్ డీజీఎంవోల మధ్య చర్చలు
  •  సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని రోడ్‌మ్యాప్
  • ఈ చర్చల వెనుక యూఏఈ ఉందని సమాచారం
  • యూఏఈ విదేశాంగ మంత్రి భారత్‌‌లో పర్యటించిన తర్వాత రోజే చర్చలు
UAE royals behind Secret India Pakistan peace roadmap

గత నెలలో భారత్, పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంవోలు) మధ్య చర్చలు జరిగిన విషయం తెలిసిందే. జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి ఇకపై కాల్పులు జరుపుకోవద్దని ఇరు దేశాల సైన్యాలు పరస్పర అంగీకారానికి వచ్చాయి. అయితే, దాయాదుల మధ్య చర్చల వెనుక యూఏఈ కీలక పాత్ర పోషించినట్టు సమాచారం. యూఏఈ విదేశాంగ మంత్రి భారత్‌‌లో పర్యటించిన తర్వాత రోజే ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు జరిగాయి.

ఫిబ్రవరి 26న యూఏఈ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్, భారత్ విదేశాంగ మంత్రి  జైశంకర్‌ మధ్య జరిగిన చర్చలకు సంబంధించి కొన్ని వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ  ఒప్పందం ఇక దాదాపు అటకెక్కినట్లేనని భావిస్తున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఉల్లంఘన, చొరబాట్లు తదితర సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనే విషయాలపై రోడ్‌మ్యాప్ రూపొందించుకోవాలని ఇరు దేశాలూ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగా తదుపరి దశలో ఇరు దేశాలూ తమ రాయబారులను తిరిగి నియమించుకోనున్నట్లు సమాచారం. జమ్మూ కశ్మీర్‌కు 2019 ఆగస్టులో ప్రత్యేక హోదా రద్దయిన తర్వాత ఉద్రిక్తతలు తారస్థాయికి చేరడంతో భారత్, పాక్‌లు తమ రాయబారులను వెనక్కు తీసుకున్న విషయం తెలిసిందే.

More Telugu News