Corona Virus: రాజమండ్రిలో కరోనా కలకలం... ఓ కాలేజీలో 163 మందికి కరోనా పాజిటివ్

Corona scare in Rajahmundry college
  • ఏపీలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
  • రాజమండ్రిలో ఓ కాలేజీలో కరోనా పరీక్షలు
  • 700 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించిన వైద్యబృందం
  • సోమవారం ఒక్కరోజే 140 మందికి పాజిటివ్
  • కంటైన్మెంట్ జోన్ గా ప్రకటన
తెలంగాణలో ఇప్పటికే పలు విద్యాసంస్థలు, వసతి గృహాల్లో కరోనా వ్యాప్తి తీవ్రతరం కావడం తెలిసిందే. తాజాగా ఏపీలోనూ అదే స్థాయిలో కరోనా విజృంభణ కనిపిస్తోంది. రాజమండ్రిలోని ఓ కాలేజీలో ఏకంగా 163 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తేలింది. శనివారం ఈ కాలేజీలో 13 కేసులు రాగా, ఆదివారం 10 కేసులు వెలుగుచూశాయి. సోమవారం నాడు ఒక్కరోజే 140 పాజిటివ్ కేసులు రావడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

దీనిపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ గౌరీనాగేశ్వరరావు స్పందిస్తూ... 700 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు జరిపామని వెల్లడించారు. పాజిటివ్ విద్యార్థులను ఒకే ప్రదేశంలో ఉంచి, ఆ ప్రదేశాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించామని వివరించారు. కరోనా సోకని విద్యార్థులను మరో హాస్టల్ లో ఉంచినట్టు తెలిపారు.

కాగా, తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాదులోని అనేక వసతిగృహాల్లో కరోనా వ్యాప్తి అధికంగా ఉంది. ఉస్మానియా వర్సిటీలో సైతం కరోనా ఉనికి వెల్లడైంది. పెద్ద సంఖ్యలో విద్యార్థులు కరోనా బారినపడుతుండడంతో విద్యాసంస్థల కొనసాగింపుపై రేపు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో స్పష్టత ఇస్తారని తెలుస్తోంది.
Corona Virus
Students
Positive
Rajahmundry
Andhra Pradesh

More Telugu News