Bangladesh: ముజిబుర్‌ రెహ్మాన్‌, ఖబూస్‌ బిన్‌ సైద్‌కు గాంధీ శాంతి పురస్కారం... ప్రకటించిన కేంద్రం

Sheikh Mujibur Rahman and Omans longtime ruler Sultan Qaboos for the Gandhi Peace Prize
  • చనిపోయిన వారికి ప్రకటించడం ఇదే తొలిసారి
  • ముజిబుర్‌ను మానవ హక్కులు, స్వేచ్ఛా విజేతగా అభివర్ణించిన మోదీ
  •  భారత్‌- ఒమన్‌ మధ్య  ప్రత్యేక సంబంధాల నిర్మాణంలో  ఖుబూస్ కీలక పాత్ర
  • త్వరలో బంగ్లాదేశ్‌లో పర్యటించనున్న మోదీ
జాతిపిత మహాత్మా గాంధీ పేరిట ఏటా ఇచ్చే అంతర్జాతీయ శాంతి పురస్కారాలను భారత ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. 2020, 2019 సంవత్సరాలకు కలిపి ఒకేసారి ఈ పురస్కారాలను వెల్లడించింది. 2020 ఏడాదికి గాను బంగ్లాదేశ్‌ తొలి అధ్యక్షుడు దివంగత షేక్‌ ముజిబుర్‌ రెహ్మాన్‌ను ఎంపిక చేయగా.. 2019కి ఒమన్‌ సుల్తాన్‌ దివంగత ఖబూస్‌ బిన్‌ సైద్‌ను ఎంపిక చేసింది. విజేతలకు కోటి రూపాయల చొప్పున నగదు బహుమానంతో పాటు ప్రశంసాపత్రం కూడా ప్రదానం చేస్తారు.

వీరివురు గొప్ప దూరదృష్టి కలిగిన నాయకులుగా కేంద్రం పేర్కొంది. ముజిబుర్‌ రెహ్మాన్, ఖబూస్‌.. ఇద్దరూ గాంధీజీ చూపిన అహింసాయుత మార్గంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరివర్తన కోసం చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మరణించిన వారికి ఈ పురస్కారం ప్రకటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

బంగబంధుగా పిలిచే షేక్‌ ముజిబుర్‌ రెహ్మాన్‌ను మానవ హక్కులు, స్వేచ్ఛా విజేతగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఆయన భారతీయులకూ ఓ హీరో అన్నారు. ఆయన ఇచ్చిన వారసత్వం, ప్రేరణ ఇరు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేశాయని గుర్తుచేశారు.

అలాగే, 2019కి గాంధీ శాంతి పురస్కారానికి ఎంపికైన ఖబూస్.. ‌అంతర్జాతీయ సమస్యలు తలెత్తినప్పుడు మధ్యవర్తిత్వం ద్వారా వాటిని పరిష్కరించడంలో చొరవ తీసుకొని, శాంతియుతమార్గంలో పరిష్కారానికి కృషిచేసి ప్రపంచ మన్ననలు పొందారు. భారత్‌- ఒమన్‌ మధ్య  ప్రత్యేక సంబంధాల నిర్మాణంలో ఆయనదే కీలక పాత్ర. భారత్‌లో విద్యాభ్యాసం చేసిన ఖుబూస్‌.. మన దేశంతో ప్రత్యేక సంబంధాలు కొనసాగించారు.

మార్చి 26న బంగ్లాదేశ్‌లో జరిగే నేషనల్‌ డే కార్యక్రమానికి ప్రధాని మోదీ అతిథిగా హాజరుకానున్నారు. ఈ తరుణంలో ఆ దేశ నేత ముజిబుర్‌ రెహ్మాన్‌కు పురస్కారం ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. కొవిడ్‌ సంక్షోభం తర్వాత మోదీ తొలి విదేశీ పర్యటన ఇదే కావడం గమనార్హం.
Bangladesh
Sheikh Mujibur Rahman
Oman
Sultan Qaboos

More Telugu News