Indus River: రెండేళ్ల తర్వాత భారత్​– పాక్​ చర్చలు!

  • సింధూ నదీ జలాల పంపకాలపై రేపు భేటీ
  • రెండు రోజుల పాటు ఢిల్లీలో సమావేశాలు
  • నేడు భారత్ కు రానున్న పాక్ ప్రతినిధి బృందం
  • భారత జల విద్యుత్ ప్రాజెక్టులపై పాక్ అభ్యంతరాలు
After 2 years India Pakistan to hold talks on Indus water sharing tomorrow

సింధూ నది నీటి పంపకాల పంచాయితీని తేల్చుకునేందుకు భారత్, పాక్ సిద్ధమయ్యాయి. రెండేళ్ల తర్వాత తొలిసారి భేటీ కానున్నాయి. ఏటా సమావేశాలు జరుగుతున్నా.. కరోనా నేపథ్యంలో గత ఏడాది సమావేశం జరగలేదు. ఈ నేపథ్యంలోనే రెండేళ్ల తర్వాత ఇప్పుడు మంగళవారం, బుధవారం రెండు దేశాల అధికారులు సమావేశం కానున్నారు. ఇరు దేశాల ప్రతినిధులు తమ అభ్యంతరాలు, సమస్యలపై చర్చించనున్నారు. ఆ సమావేశాల కోసం పాక్ ప్రతినిధుల బృందం ఈ రోజు భారత్ రానుంది.

లడఖ్ లో సింధూ నదిపై భారత్ పలు జల విద్యుత్ ప్రాజెక్టులను పూర్తి చేసింది. వాటిపై పాక్ ఎప్పటి నుంచో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే మార్చి 23, 24న ఢిల్లీలో సింధూ నదీ నీటి పంపకాలపై శాశ్వత సింధు కమిషన్ 116వ సమావేశం జరుగుతుందని ఇటీవల పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి జహీద్ హఫీజ్ ఛౌదరి ప్రకటించారు. భారత్ కడుతున్న పాకాల్ దూల్, లోయర్ కల్నాయి జలవిద్యుత్ ప్రాజెక్టుల డిజైన్లు పాక్ కు నష్టం చేకూర్చే విధంగా ఉన్నాయని అన్నారు.

సింధూ జలాల పంపిణీ విషయంలో భారత్ కమిషనర్ గా ఉన్న పీకే సక్సేనా.. భారత ప్రతినిధి బృందానికి నేతృత్వం వహించనున్నారు. కేంద్ర జల సంఘం, కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ, జాతీయ జలవిద్యుత్ కార్పొరేషన్ లకు చెందిన నిపుణులు సభ్యులుగా ఉంటారు. పాకిస్థాన్ తరఫున సయ్యద్ మహ్మద్ మెహెర్ అలీ షా.. వారి ప్రతినిధి బృందానికి నేతృత్వం వహించనున్నారు.

More Telugu News