Harish Rao: రాహుల్ సిప్లిగంజ్ మొదటి సినిమాకు ఎలాంటి సాయం కావాలన్నా చేస్తా: మంత్రి హరీశ్ రావు

 Harish Rao assures any help to Rahul Sipligunj for his first movie
  • బిగ్ బాస్ షో తర్వాత మరింత బిజీగా రాహుల్ సిప్లిగంజ్
  • ఓవైపు సినిమాలు, మరోవైపు దుస్తుల వ్యాపారం
  • 'ఊకో కాకా' పేరుతో షోరూమ్ లు
  • సిద్ధిపేటలో షోరూమ్ ప్రారంభోత్సవం చేసిన హరీశ్ రావు
  • 'చిచ్చా' మూవీ పోస్టర్, టైటిల్ సాంగ్ రిలీజ్
బిగ్ బాస్ రియాల్టీ షో మూడో సీజన్ విజేతగా నిలిచిన టాలీవుడ్ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ హీరోగా వస్తున్న చిత్రం 'చిచ్చా'. ఈ సినిమా పోస్టర్ ను, టైటిల్ సాంగ్ ను తెలంగాణ మంత్రి హరీశ్ రావు సిద్ధిపేటలో లాంచ్ చేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ, రాహుల్ తెలంగాణ బిడ్డ అని పేర్కొన్నారు. 'చిచ్చా' సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నానని, రాహుల్ మొదటి సినిమాకు ఎలాంటి సాయం కావాలన్నా తాను అందిస్తానని మాటిచ్చారు. బిగ్ బాస్ షోలో ఎలా సక్సెస్ అయ్యాడో, ఈ సినిమాతో విజయం సాధించి చిత్రపరిశ్రమలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సినిమా టైటిల్ 'చిచ్చా' తనకు బాగా నచ్చిందని, తెలంగాణ బ్రాండ్ ఇమేజిని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా ఉందని కొనియాడారు.

రాహుల్ సిప్లిగంజ్ ఓ వైపు పాటలు, నటనతో బిజీగా ఉండడమే కాదు, మరోవైపు దుస్తుల వ్యాపారంలోనూ అడుగుపెట్టాడు. ఊకో కాకా పేరుతో హైదరాబాదులోనూ, తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లోనూ షోరూమ్ లు ప్రారంభించాడు. తాజాగా సిద్ధిపేటలోనూ 'ఊకో కాకా' పేరుతో షోరూమ్ ఏర్పాటు చేయగా, మంత్రి హరీశ్ రావు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగానే 'చిచ్చా' సినిమా టైటిల్ సాంగ్ లాంచ్ చేశారు. ఆర్ఎస్ ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ పై వస్తున్న 'చిచ్చా' చిత్రానికి మల్లిక్ కందుకూరి దర్శకుడు. ఇతర తారాగణం వివరాలు ప్రకటించాల్సి ఉంది.
Harish Rao
Rahul Sipligunj
Chicha
Movie
Ooko Kaaka
Tollywood

More Telugu News