హెల్మెట్ పెట్టుకుని నడిపితే ఎలాంటి కబుర్లు వినాల్సిన పనిలేదు: కార్తికేయ కొత్త చిత్రం టైటిల్ తో సైబర్ పోలీసుల ప్రచారం

19-03-2021 Fri 20:27
  • ఆకట్టుకునే పోస్టులతో సైబరాబాద్ పోలీసుల ప్రచారం
  • ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించే ప్రయత్నం
  • కార్తికేయ, లావణ్య జంటగా చావుకబురు చల్లగా చిత్రం
  • కార్తికేయ, లావణ్య ఫొటోతో సైబర్ పోలీసుల ప్రచారం
Cyberabad traffic police campaigns with Karthikeya new movie title

సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సోషల్ మీడియాలో ఎంతో ఆసక్తికరంగా పోస్టులు పెడుతుండడం తెలిసిందే. నిబంధనల పట్ల ప్రజల్లో అవగాహన కలిగించేందుకు వినూత్న మార్గాల్లో ప్రయత్నిస్తుంటారు. తాజాగా హీరో కార్తికేయ కొత్త చిత్రం 'చావుకబురు చల్లగా' టైటిల్ సాయంతో ట్రాఫిక్ నిబంధనలను ప్రచారం చేశారు. 'చావుకబురు చల్లగా' చిత్రంలో కార్తికేయ బస్తీ బాలరాజు పాత్ర పోషిస్తున్నాడు.

శవాలను తరలించడం బస్తీ బాలరాజు వృత్తి. ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి హీరోయిన్. ఈ చిత్ర యూనిట్ ఇటీవల విడుదల చేసిన ఓ స్టిల్ లో కార్తికేయ, లావణ్య త్రిపాఠి బైక్ పై జాలీగా వెళుతుంటారు. ఈ ఫొటోను పోస్టు చేసిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు... 'బస్తీ బాలరాజు గారూ, హెల్మెట్ పెట్టుకుని సరిగా నడిపితే ఎలాంటి కబుర్లు వినాల్సిన పనిలేదు' అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు నెటిజన్ల నుంచి విశేషమైన స్పందన వస్తోంది.