Cadbury: క్యాడ్‌బరీ ప్రకటన సమాజాన్ని తప్పుదారి పట్టించేలా ఉందంటూ కోర్టును ఆశ్రయించిన వ్యక్తి

A Father reaches to Consumer court asking to ban Cadbury ad
  • సాయం చేయొద్దన్న సందేశాన్ని పంపుతోందని ఆరోపణ
  • కోర్టును ఆశ్రయించిన అజ్మీర్‌కు చెందిన ఓ తండ్రి
  • ప్రకటన నిలిపివేయాలని డిమాండ్‌
  • సంస్థకు నోటీసులు జారీ చేసిన కోర్టు
ప్రముఖ చాక్లెట్‌ తయారీ సంస్థ క్యాడ్‌బరీకి చెందిన ఓ ప్రకటనపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు చెందిన ఒక వ్యక్తి వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు. ఆ ప్రకటనను నిషేధించడంతోపాటు రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

వివరాల్లోకి వెళితే... అమిత్‌ గాంధీ న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఒక రోజు తన ఆరేళ్ల కుమారుడిని పిలిచి, తాతకు మందులు ఇవ్వాలని చెప్పారు. దీనికి తన కొడుకు నుంచి వచ్చిన సమాధానం చూసి ఆశ్చర్యపోవడం అమిత్‌ వంతైంది. ఆ ఆశ్చర్యమే తర్వాత ఆందోళనకు కూడా దారితీసింది.

 ఇంతకీ ఆయన కుమారుడు ఏమన్నాడంటే.. ‘నాన్నా... మనం ఏమీ చేయకపోయినా ప్రజలకు సహాయం చేసి వారి ప్రాణాలను కాపాడగలం’ అని బదులిచ్చాడు. తన కుమారుడు ఏమి చెబుతున్నాడో తొలుత అమిత్‌కు అర్థం కాలేదు. తర్వాత అది క్యాడ్‌బరీ యాడ్‌లో వచ్చే సంభాషణ అని తెలిసింది.

అయితే, ఈ ప్రకటన తప్పుడు సందేశం పంపేలా ఉందని అమిత్‌ గాంధీ ఆరోపించారు. ఏమీ చేయకపోవడం, ఎవరికీ సహాయం చేయకపోవడం వంటి తప్పుడు అర్థాన్ని సమాజంలోకి తీసుకెళుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే టీవీలు, సామాజిక మాధ్యమాలు, వెబ్‌సైట్ల నుంచి ఆ ప్రకటనను తొలగించేలా క్యాడ్‌బరీ మోండలేజ్‌ ఇండియా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను ఆదేశించాలని వినియోగదారుల ఫోరంను కోరారు.

దీనికి స్పందించిన జిల్లా వినియోగదారుల కమిషన్ దీనిపై మే 4లోగా సమాధానం ఇవ్వాలని చాక్లెట్ కంపెనీకి నోటీసు జారీ చేసింది.
Cadbury
Chocolate
Consumer Court
Advertisements

More Telugu News