Kodali Nani: అవసరమైతే చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేస్తారు: కొడాలి నాని

If needed CID officers will arrest Chandrababu says Kodali Nani
  • దళితులను మోసం చేసి రూ. 500 కోట్లు కాజేశారు
  • కారుచౌకగా అసైన్డ్ భూములను కొని.. అధిక ధరకు అమ్ముకున్నారు
  • చంద్రబాబు సహా అందరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడంలో తప్పులేదు
అమరావతి ప్రాంతంలోని అసైన్డ్ భూముల కొనుగోళ్లు, అమ్మకాల వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబుకు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.

దీనిపై మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేస్తారని ఆయన అన్నారు. అరెస్ట్ చేసి కోర్టుకు కూడా పంపుతారని చెప్పారు. సీఆర్డీఏ ఛైర్మన్ గా తనకు తానే చంద్రబాబు ప్రకటించుకున్నారని... ఇష్టం వచ్చినట్టు జీవోలను విడుదల చేసి, దళితులను మోసం చేసి, రూ. 500 కోట్లకు పైగా కాజేశారని ఆరోపించారు.

అమరావతిలో రాజధాని వస్తుందనే విషయాన్ని చంద్రబాబు అనుచరులు ముందే తెలుసుకుని అక్కడి దళితులను బెదిరించి వారి భూములను కారుచౌకగా కొట్టేశారని కొడాలి నాని అన్నారు. ఆ తర్వాత ఆ భూములను ప్రభుత్వానికి అధిక ధరకు అమ్ముకున్నారని చెప్పారు. అనుభవించడానికే అసైన్డ్ భూములని... వాటిని అమ్మడం, కొనడం చేయరాదని అన్నారు. ఆ విషయం తెలిసి కూడా చంద్రబాబు దళితుల అసైన్డ్ భూములను కాజేశారని చెప్పారు.

దళితులకు మేలు చేయాలనే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని కొడాలి నాని తెలిపారు. ఇందులో భాగంగానే చంద్రబాబుకు నోటీసులు పంపారని చెప్పారు. చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణతో పాటు ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడంలో తప్పు లేదని అన్నారు. అచ్చెన్నాయుడు, బుద్ధా వెంకన్నలాంటి కుక్కలు ఎంత మొరిగినా దళితులకు న్యాయం చేయడంలో ప్రభుత్వం వెనకడుగు వేయదని చెప్పారు.
Kodali Nani
YSRCP
Chandrababu
Telugudesam
Arrest
Amaravati
Assigned Lands
Dalit Lands
CID

More Telugu News