Somireddy Chandra Mohan Reddy: అసలు నేరమే జరగనప్పుడు చంద్రబాబు నేరస్థుడు ఎలా అవుతారు?: సోమిరెడ్డి

  • చంద్రబాబుపై అమరావతి భూ స్కాం ఆరోపణలు
  • తాజాగా సీఐడీ నోటీసులు
  • ఏ ఒక్కరైనా ఫిర్యాదు చేశారా? అని ప్రశ్నించిన సోమిరెడ్డి
  • నోటీసులు ఎలా ఇస్తారని ఆగ్రహం
  • ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని కోర్టు తీర్పిచ్చిందని వెల్లడి
Somireddy responds after CID issues notices to Chandrababu

అమరావతిలో భూ స్కాం జరిగిందంటూ టీడీపీ అధినేత చంద్రబాబుకు సీఐడీ నోటీసులు ఇవ్వడం తెలిసిందే. దీనిపై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని కోర్టులు తీర్పులిచ్చినా చంద్రబాబుపై కేసులు పెట్టడం దారుణమని అన్నారు. అసలు నేరమే జరగనప్పుడు ఆయన నేరస్థుడు ఎలా అవుతారని ప్రశ్నించారు. అమరావతిలో తమ భూముల విషయంలో అక్రమాలు జరిగాయని ఒక్క దళితుడైనా ఫిర్యాదు చేశాడా? అని నిలదీశారు. చంద్రబాబుపై ఎస్సీఎస్టీ కేసు పెట్టడం ఏంటని సోమిరెడ్డి మండిపడ్డారు.

"2015లో అమరావతి భూసేకరణ జరిగింది. అప్పటినుంచి ఇప్పటివరకు ఒక్క దళితుడు కానీ, ఇతరులు కానీ తమ భూముల్లో అక్రమాలు జరిగాయని, తమ భూముల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ చేశారని ఎవరూ ఆరోపించలేదు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని కిలారి రాజేశ్, దమ్మాలపాటి శ్రీనివాస్ కేసుల్లో హైకోర్టు చాలా స్పష్టంగా తీర్పు ఇచ్చింది. అయినప్పటికీ చంద్రబాబు వెంటపడుతున్నారు.

పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ధన, అంగబలంతో గెలవగానే తమకు ఎదురులేదనే భ్రమలో ఉన్నారు. చంద్రబాబుకు నోటీసులు ఇచ్చి ఎస్సీఎస్టీ కేసులు పెడతారా? ఇదే అంశంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు తిరిగాడు... ఏం ప్రయోజనం? ఎవరైనా తనకు నష్టం జరిగిందని ఫిర్యాదు చేస్తే దానిపై విచారణ జరిపితే ఎవరికీ అభ్యంతరం లేదు. ఏడేళ్లు జరిగినా ఇప్పటివరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. మీరొచ్చి రెండేళ్లు అవుతోంది. అసలు నేరమే జరగకపోతే నోటీసులు ఎలా ఇస్తారు?" అని సోమిరెడ్డి ధ్వజమెత్తారు.

More Telugu News