Mt Kilimanjaro: కిలిమంజారోను అధిరోహించిన ఏడేళ్ల హైదరాబాద్​ చిన్నారి

7 year old from Hyderabad scales Mt Kilimanjaro
  • ముందు భయమేసిందన్న విరాట్ చంద్ర
  • మార్చి 6న ఘనత సాధించిన తెలుగు కుర్రాడు
  • ఎంతో నిబద్ధతతో శిక్షణ తీసుకున్నాడన్న కోచ్
ఎంతో అనుభవం ఉన్నవారికే పర్వతాధిరోహణ చాలా కష్టంతో కూడుకున్నది. అలాంటిది ఏడేళ్ల పసి ప్రాయంలోనే ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరాల్లో ఒకటైన కిలిమంజారోను అధిరోహించి శెభాష్ అనిపించుకున్నాడు హైదరాబాద్ చిన్నారి విరాట్ చంద్ర. ముందు చాలా భయమేసినా.. తన లక్ష్యాన్ని చేరాలన్న సంకల్పంతో శిఖరాన్ని అధిరోహించానని విరాట్ చెబుతున్నాడు. ఆ శిఖరాన్ని అధిరోహించి చిన్న వయసులోనే శిఖరాధిరోహణ చేసిన వారి జాబితాలో చోటు దక్కించుకున్నాడు.

మార్చి 6న విరాట్ ఈ ఘనత సాధించాడు. అతడిలో పర్వతాధిరోహణపై ఎంతో తపన ఉండేదని అతడి కోచ్ భరత్ చెప్పారు. అతడితో పాటు మిగతా పిల్లలకు శిక్షణనిచ్చినా వారు మధ్యలోనే తప్పుకొన్నారని, విరాట్ మాత్రం అనుకున్నది సాధించేందుకు పట్టుదలతో కృషి చేశాడని అన్నారు.

తన కజిన్ల ద్వారా పర్వతాధిరోహణపై ఇష్టం పెరిగిందని విరాట్ చెప్పుకొచ్చాడు. వారి అనుభవాలను ఎప్పటికప్పుడు తెలుసుకున్నానని అన్నాడు. దీంతో వారిలాగానే తాను కూడా పర్వతాధిరోహణ చేయాలనుకున్నానని చెప్పాడు. దీని గురించి తన తల్లిదండ్రులకు చెప్పానని, భరత్ సార్ దగ్గర శిక్షణను ఇప్పించారని వెల్లడించాడు.

ఒకసారి ఉత్తరాఖండ్ లోని రుదుగైరా పర్వతాలను విరాట్ కజిన్లు అధిరోహించారని, ఆ టైంలో వారితో వీడియో కాల్ మాట్లాడిన విరాట్.. దానిపై మక్కువ పెంచుకున్నాడని అతడి తల్లి చెప్పారు. ఇక, ట్రైనింగ్ ను విరాట్ చాలా సీరియస్ గా తీసుకున్నాడని, ఎంతో నిబద్ధత కనబరిచాడని భరత్ చెప్పారు.

అతడు ఇంకా చిన్న పిల్లాడే కాబట్టి కిలిమంజారో అధిరోహణకు సంబంధించి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నామని వివరించారు. మధ్యలో ఏదైనా సమస్యగా అనిపిస్తే వెనక్కు వచ్చేయాలని ముందే డిసైడ్ అయ్యామని, కానీ, వేటినీ లెక్క చేయకుండా విరాట్ కిలిమంజారోను ఎక్కేశాడని భరత్ చెప్పారు. మార్చి 5న ట్రెక్కింగ్ ను మొదలుపెడితే.. మార్చి 6న కిలిమంజారోలోని ఉహురు శిఖరాన్ని చేరుకున్నామన్నారు.
Mt Kilimanjaro
Hyderabad
Virat Chandra

More Telugu News