Lella Appireddy: చంద్రబాబు సీఐడీ విచారణ ఎదుర్కోవాలి: వైసీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి

  • అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు
  • చంద్రబాబుకు సీఐడీ నోటీసులు
  • చంద్రబాబు సమాధానం చెప్పాలన్న అప్పిరెడ్డి
  • చట్టం తన పని తాను చేసుకుంటూ వెళుతుందని వెల్లడి
  • చంద్రబాబు హయాంలో భూ అక్రమాలు జరిగాయని ఉద్ఘాటన
Lella Appireddy comments on Chandrababu

అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ సీఐడీ నోటీసులు ఇవ్వడంపై వైసీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి స్పందించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతిలో భూ కుంభకోణం జరిగిందని, తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించకతప్పదని అన్నారు. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళుతుందని, నోటీసులు అందుకున్న చంద్రబాబు విచారణను ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేశారు.

అయితే, విచారణను ఎదుర్కొనే అలవాటు లేని చంద్రబాబు... స్టేలు తెచ్చుకుంటూ నెట్టుకొస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు ధైర్యంగా విచారణను ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. నేడు చంద్రబాబును చట్టాలు నిలదీసి అడుగుతున్నాయని, 14 ఏళ్లు నిబద్ధతతో సీఎంగా పనిచేశానని చంద్రబాబు భావిస్తే సీఐడీ అడిగే ప్రశ్నలకు బదులివ్వాలని లేళ్ల అప్పిరెడ్డి స్పష్టం చేశారు. అలాకాకుండా కోర్టు వ్యవస్థలను మేనేజ్ చేసి తప్పించుకుందామనుకుంటే మాత్రం రాష్ట్ర ప్రజలు ఆయనను శాశ్వతంగా బహిష్కరిస్తారని పేర్కొన్నారు.

నాడు, హైదరాబాద్ నుంచి అమరావతిలో అకస్మాత్తుగా ఊడిపడ్డారని.... ఇతరులకు మాత్రం మరో చోట రాజధాని వస్తుందని చెప్పి తప్పుదోవ పట్టించారని, తనవారికి మాత్రం అమరావతిలోనే రాజధాని వస్తుందని ముందే సమాచారం ఇచ్చి తక్కువ ధరలకే భూములు కొనుగోలు చేయించారని చంద్రబాబుపై లేళ్ల అప్పిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.

తన ఐదేళ్ల పాలనలో అమరావతి భూములపై ఇష్టంవచ్చినట్టు జీవోలు ఇచ్చి, తమకు కావాల్సిన వారికి భూములు అప్పగించారని, ఇప్పుడీ అక్రమాలన్నింటిపై చంద్రబాబు సీఐడీ ముందు విచారణకు రావాల్సిందేనని స్పష్టం చేశారు.

More Telugu News