Amit Shah: మమతాజీ, హత్యకు గురైన 130 మంది మా కార్యకర్తల తల్లుల బాధేంటో తెలుసా?: అమిత్ షా

  • పశ్చిమ బెంగాల్‌లో వేడెక్కిన ఎన్నికల ప్రచారం
  • టీఎంసీ, భాజపా పరస్పర విమర్శలు
  • నేడు హోంమంత్రి అమిత్‌ షా పర్యటన
  • మమతా బెనర్జీపై షా తీవ్ర విమర్శలు
Amith Shah fires on mamata banerjee in an election rally

మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్‌లో ప్రచారం వేడెక్కింది. తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ), భాజపా నేతలు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు. భాజపా నేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సోమవారం బెంగాల్‌లోని బంకూరాలో ప్రచారం నిర్వహించారు. ఇటీవలి నందిగ్రామ్‌లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాలికి గాయమైన ఘటనను ఆయన ప్రస్తావిస్తూ ఆమెపై విమర్శలు గుప్పించారు.

 ‘‘ఇటీవల మమతా జీ కాలికి గాయమైంది. ఆమెకు ఎలా గాయమైందో ఎవరికీ తెలియదు. టీఎంసీ దీన్నొక కుట్రగా ఆరోపిస్తోంది.  కానీ, కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం ప్రమాదవశాత్తూ జరిగిందని స్పష్టం చేసింది’’ అంటూ టీఎంసీ నేతల విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు.

అలాగే గాయమైన కాలితో చక్రాల కుర్చీలో పర్యటిస్తున్న మమతకు.. హత్యకు గురైన 130 మంది మా కార్యకర్తల తల్లుల బాధేంటో తెలుసా? అని అమిత్‌ షా ప్రశ్నించారు. మమత త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానన్నారు. అయితే, రాజకీయ హింసలో ప్రాణాలు కోల్పోయిన భాజపా కార్యకర్తల గురించి కూడా మమత ఆలోచిస్తే బాగుండేదన్నారు.

మరోవైపు కాలికి గాయమైనప్పటికీ.. చక్రాల కుర్చీలోనే మమత ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. కోల్‌కతాకు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న పురూలియాలో సోమవారం ప్రచారం నిర్వహించారు. తన గాయం కంటే ప్రజల బాధ పెద్దదని, అదే తనను ముందుకు నడిపిస్తోందని దీదీ అన్నారు.

More Telugu News