Tamilisai Soundararajan: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం.. ప్రధానాంశాలు!

  • ప్రజల పురోగతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
  • ఏడేళ్ల మేధోమధనం వల్ల రాష్ట్రం దూసుకుపోతోంది
  • పారిశ్రామికీకరణ ద్వారా ఉద్యోగావకాశాలను కల్పించాం
  • విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణ
  • మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సమస్య లేకుండా చేశాం
Governor Tamilisai speech in TS Assembly budget sessions

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీకి వచ్చిన గవర్నర్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలికారు. అనంతరం ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. తన ప్రసంగాన్ని తమిళిసై తెలుగులో ప్రారంభించారు.

రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల పురోగతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె అన్నారు. ఆరున్నర సంవత్సరాల మేధోమధనం ఫలితంగా తెలంగాణ దూసుకెళోందని చెప్పారు. ఎన్నో ఇబ్బందులు ఎదురైనప్పటికీ నిలదొక్కుకున్నామని అన్నారు. పారిశ్రామికీకరణ ద్వారా అనేక ఉద్యోగావకాశాలను కల్పించామని చెప్పారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారాలపై దృష్టిని సారించామని అన్నారు. సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని తెలిపారు.

రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 2.28 లక్షలకు పెరిగిందని తమిళిసై చెప్పారు. కరోనా వల్ల అనేక రాష్ట్రాలు ఇబ్బంది పడ్డాయని, తమ ప్రభుత్వం మాత్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ, కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొందని అన్నారు. ఆర్థిక నిర్వహణలో క్రమశిక్షణను పాటిస్తున్నామని చెప్పారు. అనేక విషయాలలో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉందని అన్నారు. వనరులను సక్రమంగా వినియోగించుకుంటూ రాష్ట్రం పురోగమిస్తోందని చెప్పారు. విద్యుత్ రంగంలో అద్వితీయమైన విజయాలను సాధించిందని అన్నారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. తెలంగాణ విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా అవతరించిందని అన్నారు.

మిషన్ భగీరథతో తాగునీటి సమస్యకు చెక్ పెట్టామని గవర్నర్ తెలిపారు. ఈ కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. తండాలు, గిరిజన గ్రామాలకు కూడా మంచి నీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రాన్ని ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా మార్చామని చెప్పారు. సమైక్యాంధ్రలో ప్రాజెక్టులను పట్టించుకోలేదని... తాము పెండింగ్ ప్రాజక్టులను పూర్తి చేసి 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని తెలిపారు. రైతు బంధు ద్వారా ఎకరానికి రూ. 10 వేల పెట్టుబడి సాయం అందిస్తున్నామని చెప్పారు. ధాన్యం సేకరణలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉందని అన్నారు. తెలంగాణలో 39,36,521 మందికి పెన్షన్లను ఇస్తున్నామని చెప్పారు.

More Telugu News