Satyapal Malik: మోదీ, అమిత్ షాలకు మింగుడుపడని వ్యాఖ్యలు చేసిన గవర్నర్ సత్యపాల్ మాలిక్

Meghalaya Governor Satyapal Malik sensational comments on farmers
  • రైతులను అడ్డుకునే ప్రయత్నం చేయవద్దు
  • రోజురోజుకు రైతులు పేదలుగా మారుతున్నారు
  • పండించిన పంటను ఎక్కడైనా అమ్ముకోవడమనేది 15 ఏళ్ల నాటి చట్టం
మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమత్రి అమిత్ షాలు రైతులను అడ్డుకునే ప్రయత్నం చేయకూడదని కోరారు. రైతుల పంటకు కనీస మద్దతు ధరను చట్ట ప్రకారం ప్రకటిస్తే వారు ఆందోళనలను విరమిస్తారని చెప్పారు. రైతుల ఉద్యమాన్ని అణచివేసేందుకు బలగాలను ఉపయోగించరాదని, కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్న రైతులను ఢిల్లీ నుంచి ఉత్తచేతులతో పంపరాదని... వారికి భరోసా కల్పించి పంపించాలని ప్రధాని మోదీ, అమిత్ షాలను కోరానని చెప్పారు.

రైతులకు అనుకూలంగా మన దేశంలో ఎలాంటి చట్టాలు లేవని మాలిక్ అన్నారు. ఏ దేశంలో అయితే రైతులు, జవాన్లు అంసంతృప్తితో ఉంటారో... ఆ దేశం ఎప్పటికీ అభివృద్ధి చెందలేదని చెప్పారు. రైతులు, జవాన్లు తృప్తిగా ఉండేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని అన్నారు. రైతులు రోజురోజుకు పేదలుగా మారుతున్నారని... ఇదే సమయంలో ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వ అధికారులు, సిబ్బంది జీతభత్యాలు పెరుగుతున్నాయని చెప్పారు.

రైతు పండించే పంట మార్కెట్లో చౌకగా ఉంటోందని... అదే రైతు కొనుక్కునే వస్తువులు మాత్రం ఖరీదుగా ఉంటున్నాయని అన్నారు. తాము పేదలుగా ఎందుకు మారుతున్నామో కూడా రైతులకు అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పంట పండించేటప్పుడు వాటి ధర ఎక్కువగా ఉంటోందని... పంట చేతికి వచ్చిన తర్వాత ధర తక్కువగా ఉంటోందని అన్నారు.

కొత్త వ్యవసాయ చట్టాలపై సత్యపాల్ మాలిక్ మాట్లాడుతూ, పండించిన పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చని చెపుతున్నారని... ఇది 15 ఏళ్ల నాటి చట్టమని అన్నారు. రైతులు తమ పంటను తీసుకుని వేరే ప్రాంతానికి వెళ్లినప్పుడు వారిపై లాఠీఛార్జిలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పారు. రైతులు అడుగుతున్న పలు ప్రశ్నలకు మనం సమాధానాలు చెప్పాల్సి ఉందని అన్నారు. రైతులకు అనుకూలంగా ఒక్క చట్టం కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రైతుల సమస్యలను పరిష్కరించే క్రమంలో తాను ఎంత వరకైనా వెళ్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆందోళన చేస్తున్న సిక్కు రైతుల గురించి ప్రస్తావిస్తూ, సిక్కులు ఏ విషయంలోనూ వెనకడుగు వేయరని, 300 ఏళ్ల తర్వాత కూడా విషయాన్ని మర్చిపోరనీ సత్యపాల్ మాలిక్ అన్నారు. ఈ సందర్భంగా గతంలో జరిగిన ఆపరేషన్ బ్లూస్టార్ నాటి ఓ సంఘటనను గుర్తుచేశారు.

ఆపరేషన్ బ్లూస్టార్ జరిగిన తర్వాత అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ నెల రోజుల పాటు 'మహా మృత్యుంజయ జపం' చేశారని మాలిక్ చెప్పారు. ఈ విషయం గురించి అరుణ్ నెహ్రూ ఒకసారి తనతో మాట్లాడుతూ చెప్పారని అన్నారు. 'మీరు ఇలాంటి ఆచారాలను నమ్మరు కదా... ఎందుకు జపాలు చేస్తున్నారు?' అని ఇందిరను అరుణ్ నెహ్రూ అడిగితే... 'మీకు తెలియదు. నేను వారి స్వర్ణమందిరాన్ని డ్యామేజ్ చేశాను. వారు నన్ను వదలరు' అని ఇందిర సమాధానం ఇచ్చారట అని చెప్పారు. మరోవైపు, సత్యపాల్ మాలిక్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
Satyapal Malik
Meghalaya Governor
Narendra Modi
Amit Shah
Farm Laws

More Telugu News