East Godavari District: తూర్పుగోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరి మృతి.. మరొకరి గల్లంతు

Two dead in an Accident in East Godavari dist
  • శివరాత్రి వేడుకల్లో పాల్గొని తిరిగి వెళ్తుండగా ఘటన
  • లొల్ల లాకుల మూల మలపు వద్ద అదుపు తప్పిన కారు
  • ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన ఇద్దరు
తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం లొల్ల లాకుల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శివరాత్రి వేడుకల్లో పాల్గొని తిరిగి కారులో ఇంటికి వెళ్తుండగా, అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు గల్లంతు కాగా వారిలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు.
 
పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలంలోని గొల్లలకోడేరుకు చెందిన ముందిటి సరేశ్ వర్మ (36), చింతలపాటి శ్రీనివాస్‌రాజు (46), ఇందుకూరి వెంకట సత్యనారాయణరాజు, ముదునూరి వెంకటగణపతి రాజు, మున్నింటి సీతారామరాజు ఒకే అపార్ట్‌మెంట్‌లో నివసిస్తుంటారు. నిన్న శివరాత్రి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలోని వసంతవాడలో బంధువుల ఇంటికి వచ్చారు. అందరూ కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ తెల్లవారుజామున తిరిగి కారులో తిరుగుపయనమయ్యారు.

ఈ క్రమంలో లొల్ల లాకుల మలుపు వద్ద కారు అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లింది.  ప్రమాదం నుంచి వెంకటగణపతిరాజు, సీతారామరాజు సురక్షితంగా బయటపడ్డారు. మిగిలిన ముగ్గురు గల్లంతు కాగా, వారిలో సురేశ్ వర్మ, శ్రీనివాస్‌రాజు మృతి చెందారు. వారి మృతదేహాలను వెలికి తీశారు. గల్లంతైన వెంకట సత్యనారాయణరాజు కోసం గాలిస్తున్నారు.
East Godavari District
Road Accident
West Godavari District

More Telugu News