మోదీ ఫొటోపై కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ఆరోగ్యశాఖ

11-03-2021 Thu 15:41
  • కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై మోదీ ఫొటో
  • ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని టీఎంసీ ఫిర్యాదు
  • ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో మోదీ ఫొటోను తొలగిస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ నిర్ణయం
Union Health Ministry takes key decision on Modi Pic

నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ని చోట్ల ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై ఉన్న ప్రధాని మోదీ ఫొటోపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న తరుణంలో... ప్రధాని ఫొటోను తొలగించాలని నిర్ణయించింది.

ఈ సర్టిఫికెట్లపై మోదీ ఫొటోను ప్రచురించి ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి టీఎంసీ ఫిర్యాదు చేసింది. దీంతో మోదీ ఫొటోను తొలగించాలని కేంద్ర ఆరోగ్యశాఖను సీఈసీ ఆదేశించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో ఎన్నికలు పూర్తయ్యేంత వరకు ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలో మోదీ ఫొటోను తొలగించాలని కేంద్ర ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఫొటోలను తొలగించాలని సీఎస్ లు, ఆరోగ్య కార్యదర్శులకు ఆదేశాలను జారీ చేసింది.