Pakistan: పాకిస్థాన్​ కు భారత్​ కరోనా వ్యాక్సిన్లు

Pakistan to receive 45 million Made In India vaccine under GAVI alliance
  • 'కొవ్యాక్స్' ద్వారా 4.5 కోట్ల డోసుల పంపిణీ
  • ఈ ఏడాది జూన్ నాటికి 1.6 కోట్ల డోసులు
  • కొవిషీల్డ్ ను వేస్తామన్న పాక్ సెనేటర్
చైనా వ్యాక్సిన్లే కొంటామని ఇన్నాళ్లూ పాకిస్థాన్ చెబుతూ వచ్చింది. అయితే, చైనా నుంచి ఉచితంగా వచ్చే టీకాలు మినహా.. తమకు తాముగా వాటిని కొనకూడదని ఆ దేశం నిర్ణయించుకుంది. వీలైనంత వరకు సామూహిక రోగ నిరోధక శక్తి (హెర్డ్ ఇమ్యూనిటీ) సాధించేందుకే ప్రయత్నించాలని అనుకుంది.

అలాంటి దాయాదికి ఇప్పుడు మన దగ్గర్నుంచే కరోనా వ్యాక్సిన్లు వెళ్లనున్నాయి. కరోనా టీకాల్లో ఏ పేద దేశమూ వెనకబడకుండా అందరికీ సమానంగా పంచాలన్న ఉద్దేశంతో  ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో), గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సిన్స్ అండ్ ఇమ్యూనైజేషన్ (గావి) కలిసి కొవ్యాక్స్ అనే గ్రూపును ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

ఆ గ్రూపు నుంచే భారత్ లో తయారైన 4.5 కోట్ల కరోనా వ్యాక్సిన్లు పాక్ కు అందిస్తామని కొవ్యాక్స్ వర్గాలు మంగళవారం తెలిపాయి. అందులో 1.6 కోట్ల డోసులు ఈ ఏడాది జూన్ నాటికి పాక్ కు అందుతాయని పేర్కొన్నాయి. కాగా, ఇదే విషయాన్ని గత గురువారం పాక్ సెనేటర్ ముషాహిద్ హుస్సేన్ సయ్యద్ ఆ దేశ చట్టసభలో ప్రకటించారు. భారత్ తయారు చేసిన కరోనా టీకాలను పాక్ ప్రజలకు వేస్తామన్నారు. సీరమ్ ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేసిన కొవిషీల్డ్ ను కొవ్యాక్స్ పంపుతుందన్నారు.

కాగా, ఇప్పటిదాకా 65 దేశాలకు భారత్ కరోనా వ్యాక్సిన్లను సరఫరా చేసింది. మొత్తంగా 5.8 కోట్ల డోసులను ఆయా దేశాలకు పంపించింది. అందులో 1.63 కోట్ల డోసులను కొవ్యాక్స్ కింద పంపిణీ చేయగా.. 77 లక్షల డోసులను ఉచితంగా అందించింది. మిగతా 3.38 కోట్ల డోసులను వివిధ దేశాలకు అమ్మింది. కాగా, కొన్ని నెలల క్రితం వ్యాక్సిన్ల సరఫరా కోసం పాకిస్థాన్ ప్రభుత్వంతో ఓ సంస్థ చర్చలు జరిపిందని తెలుస్తోంది.
Pakistan
GAVI
COVAX
Covishield
India
WHO

More Telugu News