HCA: హెచ్‌సీఏలో ఐపీఎల్ కాక.. శివలాల్ యాదవ్, అజారుద్దీన్ మధ్య మాటల యుద్ధం!

  • హైదరాబాద్‌కు ఆతిథ్యం లేకపోవడం సిగ్గు చేటన్న శివలాల్
  • హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌పై మండిపాటు
  • తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్
  • నీ అవినీతి సంగతి నాకు తెలుసన్న అజారుద్దీన్
  • తన వద్ద మంత్రదండం లేదని స్పష్టీకరణ
IPL Row Azharuddin vs Shivlal Yadav

బీసీసీఐ ఇటీవల విడుదల చేసిన ఐపీఎల్ మ్యాచ్‌ల షెడ్యూల్ హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ)లో కాకరేపుతోంది. ఐపీఎల్ ‌కు ఆతిథ్యమిచ్చే నగరాల్లో హైదరాబాద్ లేకపోవడంపై హెచ్‌సీఏ మాజీ కార్యదర్శి శివలాల్ యాదవ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఉప్పల్ స్టేడియానికి చోటు దక్కకపోవడం హెచ్‌సీఏకే సిగ్గుచేటని దుమ్మెత్తిపోశాడు. ఉప్పల్‌కు మ్యాచ్‌లు తెచ్చుకోలేకపోయిన అజారుద్దీన్ తక్షణం తప్పుకోవాలని బీసీసీఐ మాజీ అధ్యక్షుడైన శివలాల్ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు.

ఉప్పల్ స్టేడియాన్ని అత్యుత్తమ మైదానంగా బీసీసీఐ ప్రకటించిందని, పలుమార్లు ఐపీఎల్ మ్యాచ్‌లకు వేదిక అయిందని శివలాల్ అన్నాడు. అసలు హైదరాబాద్‌కు ఏం తక్కువని ప్రశ్నించాడు. అజార్‌లో నిబద్ధత కరవైందని మండిపడ్డాడు. క్రికెట్ నిర్వహణకు సమయం లేనప్పుడు అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవడమే బెటరని సూచించాడు. ఎపెక్స్ కౌన్సిల్‌లోని సభ్యులందరూ రాజీనామా చేయాలని, మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశాడు.

శివలాల్ విమర్శలపై టీమిండియా మాజీ సారథి, హెచ్‌సీఏ చీఫ్ మహ్మద్ అజారుద్దీన్ కూడా అంతే స్థాయిలో స్పందించాడు. ఐపీఎల్ వేదికల్లో హైదరాబాద్ లేదని తెలిసిన వెంటనే అహ్మదాబాద్ వెళ్లి జే షాను కలిసి మాట్లాడినట్టు చెప్పాడు. తన విన్నపాన్ని పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారని పేర్కొన్నాడు. అయినప్పటికీ ఆ తర్వాత ప్రకటించిన వేదికల్లో హైదరాబాద్‌కు స్థానం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. బీసీసీఐని కోరడం వరకే తమ పని అని, అంతే తప్ప వారి నుంచి బలవంతంగా లాక్కోలేమని అన్నాడు.

ఇన్ని మాటలు మాట్లాడుతున్న శివలాల్ యాదవ్ 24 ఏళ్లపాటు హెచ్‌సీఏలో వివిధ పదవులు అనుభవించాడని, ఈ కాలంలో హెచ్‌సీఏకు ఏం చేశాడని అజార్ ప్రశ్నించాడు. ఎంతమంది క్రికెటర్లను తయారుచేశాడని నిలదీశాడు. హెచ్‌సీఏకు వచ్చిన రూ. 200 కోట్లను ఏం చేశాడన్నాడు. ప్రతి క్రికెట్ సంఘం ఖాతాలోనూ రూ. 100 కోట్ల  నుంచి రూ. 150 కోట్లు ఉంటే హెచ్‌సీఏలో ఒక్క రూపాయి కూడా లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. హెచ్‌సీఏ అవినీతిపై బీసీసీఐలో ప్రశ్నించినప్పుడు తలదించుకోవాల్సి వచ్చిందని అజర్ ఆవేదన వ్యక్తం చేశాడు.

మూడేళ్ల కాలానికి ఎన్నికైన తామెందుకు రాజీనామా చేయాలని ప్రశ్నించాడు. ఆయన హయాంలో జరిగిన అవినీతిపై బీసీసీఐ, దర్యాప్తు సంస్థలతోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తానని, విచారణకు ఆయన సిద్ధమేనా? అని సవాలు విసిరాడు. తన వద్ద ఏమీ మంత్రదండం లేదని అజర్ స్పష్టం చేశాడు. ఎ-డివిజన్ లీగుల్లో సెంచరీలు కొట్టామంటూ తన వద్దకు వస్తున్న వారిలో చాలామందికి బ్యాట్ సరిగా పట్టుకోవడమే రావడం లేదని, హైదరాబాద్‌లో క్రికెట్ పరిస్థితి అలా ఉందని అజర్ ఆవేదన వ్యక్తం చేశాడు.

More Telugu News