Kishan Reddy: భైంసాలో జరిగిన హింస ఏమాత్రం మంచిది కాదు: కిషన్ రెడ్డి

  • ఇటీవల భైంసాలో ఘర్షణలు
  • స్పందించిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి
  • మూడ్నాలుగు దశాబ్దాలుగా భైంసాలో ఇలాగే ఉందని వెల్లడి
  • విద్రోహశక్తుల కుట్ర అని ఆరోపణ
  • రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్
Kishan Reddy condemns violence in Bhainsa

మూడ్రోజుల కిందట భైంసాలో జరిగిన మతపరమైన హింసాత్మక ఘటనలను ఖండిస్తున్నానని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గత మూడ్నాలుగు దశాబ్దాలుగా భైంసాలో ఇలాంటి వాతావరణమే నెలకొని ఉందని, ఓ వర్గం వారు మరో వర్గంపై తరచుగా దాడులు చేస్తున్నారని, ఇది ఏమాత్రం మంచిది కాదని స్పష్టం చేశారు. ఇటీవల ఓసారి దాడి జరగ్గా, కొద్ది వ్యవధిలోనే మళ్లీ దాడి జరగడం చూస్తుంటే... మతసామరస్యాన్ని దెబ్బతీసేందుకు, సామాన్య ప్రజలను హింసించేందుకు కొన్ని విద్రోహశక్తులు కుట్ర పన్నినట్టు అర్థమవుతోందని అన్నారు.

ఈ దాడులపై ఇప్పటికే తెలంగాణ డీజీపీతో రెండుసార్లు మాట్లాడానని, వీటిపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరపాలని, భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా పోలీసు వ్యవస్థను పటిష్ఠం చేయాలని కోరానని వివరించారు. మతకల్లోలాలు, ఘర్షణలు జరగకుండా శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరినట్టు కిషన్ రెడ్డి వెల్లడించారు.

ఈ ఘటనలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు కూడా నివేదించినట్టు తెలిపారు. భైంసా ఘటనలపై బీజేపీలోనూ అంతర్గత చర్చ జరుగుతోందని చెప్పారు. ఇది రాష్ట్రపరిధిలోని అంశం కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని శాంతి నెలకొల్పాలని డిమాండ్ చేశారు.

More Telugu News