Nizamabad District: భైంసాలో మళ్లీ చెలరేగిన ఘర్షణలు.. కత్తులతో వీధుల్లో అల్లరి మూకల హల్‌చల్.. ఇద్దరు విలేకరుల పరిస్థితి విషమం!

  • సైలెన్సర్లు తీసేసిన బైకులపై పెద్ద శబ్దంతో తిరిగిన యువకులు
  • వద్దన్నందుకు చెలరేగిన ఘర్షణ
  • ప్రత్యర్థులపై రాళ్లు రువ్విన మరో వర్గం
  • అదనపు బలగాలను మోహరించిన పోలీసులు
Clashes broke out in Bhainsa in Nizamabad district

నిర్మల్ జిల్లాలోని భైంసా మరోమారు ఉద్రిక్తంగా మారింది. పట్టణంలోని ఓ కాలనీలో జరిగిన చిన్న గొడవ పెను వివాదానికి కారణమైంది. ఇరు వర్గాల మధ్య జరిగిన దాడిలో పలువురు గాయపడగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

పోలీసుల కథనం ప్రకారం.. జుల్ఫికర్ కాలనీలో రాత్రి ఏడున్నర గంటల సమయంలో కొందరు యువకులు సైలెన్సర్లు తొలగించిన బైకులపై పెద్ద శబ్దంతో కాలనీలో తిరిగారు. ఆ శబ్దాన్ని భరించలేని స్థానికులు వారిని నిలదీశారు. రైతులు, కూలీలు ఇళ్లకు వచ్చి నిద్రపోయే సమయమని, ఇంతటి శబ్దాలతో వారిని ఇబ్బంది పెట్టవద్దని యువకులకు సూచించారు.

ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ప్రారంభమైన చిన్నపాటి ఘర్షణ పెద్దగా మారింది. పరస్పరం దాడులు చేసుకునే వరకు వెళ్లింది. బట్టీగల్లీ, పంజేషా చౌక్, కోర్బగల్లీ, బస్టాండ్ సహా పలు ప్రాంతాలకు ఘర్షణలు వ్యాపించాయి. ప్రత్యర్థి వర్గం జనావాసాలపైకి రాళ్ల దాడికి దిగడమే కాకుండా ఆటోలు, కారు, బైకులను తగలబెట్టారు. కత్తులతో వీధుల్లో హల్‌చల్ చేశారు. ఓ కూరగాయల దుకాణాన్ని తగలబెట్టారు. కవరేజీకి వెళ్లిన మీడియాపైనా కత్తులతో దాడికి తెగబడ్డారు.

ఈ ఘటనలో ప్రముఖ పత్రికలకు చెందిన ముగ్గురు విలేకరులకు కూడా గాయాలయ్యాయి. దేవా, విజయ్ అనే విలేకరుల పరిస్థితి విషమంగా మారడంతో వారిని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఓ పోలీసు అధికారి, ఇద్దరు కానిస్టేబుళ్లు కూడా రాళ్ల దాడిలో గాయపడ్డారు. అప్రమత్తమైన పోలీసులు పట్టణంలో అదనపు బలగాలను మోహరించారు.

More Telugu News