India: మహమ్మారి నుంచి ప్రపంచాన్ని కాపాడుతున్న ఇండియా!: పొగడ్తల వర్షం కురిపించిన యూఎస్ శాస్త్రవేత్త1

India Becoms world Leader in Vaccine Says US Scientist
  • కరోనా వ్యాక్సిన్ ను పెద్దఎత్తున తయారు చేస్తున్న ఇండియా
  • ప్రపంచం మొత్తానికే ఓ ఔషధ కేంద్రంగా సేవలు
  • పేద దేశాలకు వరమన్న పీటర్ హూటెజ్
ప్రపంచ ఫార్మా సంస్థలతో భాగస్వామ్యాలు ఏర్పరచుకుని, కరోనా టీకాను పెద్దఎత్తున తయారు చేస్తూ, విదేశాలకు అందిస్తున్న భారత్, మహమ్మారి నుంచి ప్రపంచాన్ని రక్షిస్తోందని అమెరికా శాస్త్రవేత్త ఒకరు పొగడ్తల వర్షం కురిపించారు. కరోనా సమయంలో ప్రపంచం మొత్తానికే ఓ ఔషధ కేంద్రంగా భారత్ మారిపోయిందని నేషనల్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ డీన్ డాక్టర్ పీటర్ హోటెజ్ వ్యాఖ్యానించారు.

తాజాగా ఇండో అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫ్ గ్రేటర్ హూస్టన్ ఆధ్వర్యంలో జరిగిన వెబినార్ లో పాల్గొన్న ఆయన, రెండు ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ లు స్వల్ప, మధ్యాదాయ దేశాలకు వరంగా మారాయని అన్నారు.

కరోనా వ్యాక్సిన్ ను తమకు సరఫరా చేయాలని ఇండియాను ఆశ్రయిస్తున్న దేశాల సంఖ్య పదులను దాటి వందల్లోకి వెళుతోందని, ఆ దేశంలోని ఫార్మా ఇండస్ట్రీ ప్రపంచానికి ఎంతో సేవ చేస్తోందని అన్నారు. ఎంత భారీగా వ్యాక్సిన్ వయల్స్ ప్రపంచానికి అందితే, అంత వేగంగా తిరిగి సాధారణ స్థాయికి చేరుకోవచ్చని అంచనా వేసిన ఆయన, ఈ లక్ష్య సాధనకు ఇండియా అత్యంత కీలకమని అభిప్రాయపడ్డారు. భారత్ లోని తన సహచరులతో తరచూ వివిధ అంశాలపై తాను చర్చలు జరుపుతూనే ఉంటానని గుర్తు చేసుకున్న హోటెజ్, ఈ సమావేశం తనకెంతో ప్రత్యేకమైనదని అన్నారు.

ఇండియాలో తయారయ్యే వ్యాక్సిన్లు మెరుగైన పనితీరును కలిగివుండటమే కాకుండా, అత్యంత చౌకగానూ లభిస్తున్నాయని, పేద దేశాలకు ఇది నిజంగా ఓ వరం లాటిందని అన్నారు. ఈ వ్యాక్సిన్లు తీసుకుంటే, కరోనా కారణంగా ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం రాదని తేలిందని, ఇదే సమయంలో లక్షణాలు లేని వారి నుంచి వ్యాప్తి కూడా తగ్గిపోతుందని ఆయన గుర్తు చేశారు.

కాగా, ఇప్పటివరకూ ఇండియా నుంచి శ్రీలంక, భూటాన్, మాల్దీవులు, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, సీషల్స్ తదితర దేశాలకు 56 లక్షల కరోనా టీకా డోస్ లు ఉచితంగా సరఫరా అయ్యాయన్న సంగతి తెలిసిందే.
India
Vaccine
World
Medicine
USA

More Telugu News