వైసీపీ తాబేదారులు ఢిల్లీలో శంకరాభరణం నాట్యం చేస్తున్నారు: సీపీఐ నారాయణ

07-03-2021 Sun 15:57
  • కదిరిలో నారాయణ మున్సిపల్ ఎన్నికల ప్రచారం
  • కేంద్రం ప్రజా వ్యతిరేక చర్యలకు వైసీపీ వత్తాసు పలుకుతోందని విమర్శలు
  • సీఎం జగన్ ప్రధాని మోదీని మించిపోయాడని వ్యాఖ్యలు
  • అతడికంటే ఘనుడు ఆచంట మల్లన్న అంటూ ఎద్దేవా
  • చంద్రబాబును అఖిలపక్షానికి పిలవాలని సీఎం జగన్ కు సూచన
CPI Narayana slams YCP and BJP in Kadiri municipal election campaign

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అనంతపురం జిల్లా కదిరిలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ అధినాయకత్వంపై ధ్వజమెత్తారు. కేంద్రం ప్రజా వ్యతిరేక చర్యలన్నింటికి వైసీపీ వత్తాసు పలుకుతోందని  విమర్శించారు. బెదిరింపులు, కిడ్నాప్ లతో మున్సిపాలిటీల్లో విజయం సాధించాలని వైసీపీ చూస్తోందని ఆరోపించారు. జగన్ ప్రధాని మోదీని మించినవాడని అన్నారు. మోదీ వచ్చిన తర్వాత ఎల్ఐసీని అమ్మేస్తుంటే, జగన్ ఎల్ఐసీ ఏజెంట్లపై పన్నులు విధిస్తున్నాడని తెలిపారు. అతడి కంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టుగా ఉందని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ ది బెస్ట్ సీఎం కాదని, ది వరస్ట్ చీఫ్ మినిస్టర్ అని అభివర్ణించారు.

చమురు ధరల పెంపుతో కేంద్రానికి రూ.20 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని, ఆ ఆదాయం ఏంచేస్తున్నారో అర్థంకావడంలేదని, ఇంకా చమురు ధరలు పెంచుతూనే ఉన్నారని విమర్శించారు. ఏంచూసి బీజేపీకి గానీ, బీజేపీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతిస్తున్న వైసీపీకి ఓట్లేయాలని నారాయణ ప్రశ్నించారు. వైసీపీ తాబేదారులు స్టీల్ ప్లాంట్ అంశంపై విశాఖలో తాండవ నృత్యం, ఢిల్లీలో శంకరాభరణం నాట్యం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇక్కడ పాదయాత్ర, అక్కడ పాదపూజ అంటూ ఎద్దేవా చేశారు. మోదీకి అనుకూలంగా పాదాలు నొక్కుతున్నారని విమర్శించారు.

విశాఖలో విజయసాయి మైక్ తీసుకుని డ్యాన్స్ చేస్తుంటే ప్రజలు అసహ్యించుకుంటున్నారని నారాయణ వెల్లడించారు. ఇప్పటికైనా విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంలో సీఎం జగన్ చిత్తశుద్ధితో వ్యవహరించాలని, అఖిలపక్ష సమావేశానికి చంద్రబాబును అధికారపూర్వకంగా పిలవాలని అన్నారు. అప్పుడు ఒక్క దెబ్బతో మోదీ దిగివస్తారని, విశాఖ స్టీల్ ప్లాంట్ నిలబడుతుందని తెలిపారు.