రాష్ట్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదుల వెల్లువ‌

07-03-2021 Sun 10:35
  • నగదు పంపిణీ, మద్యం సరఫరాపై ఫిర్యాదులు
  • కాసేప‌ట్లో అధికారుల‌తో నిమ్మ‌గ‌డ్డ స‌మావేశం
  • చిత్తూరులో ఎన్నికలను నిలిపివేయాలని హైకోర్టులో పిటిష‌న్
sec receives complaints

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేప‌థ్యంలో రాష్ట్ర ఎన్నిక‌ల సంఘానికి అత్య‌ధిక సంఖ్య‌లో ఫిర్యాదులు వ‌స్తున్నాయి. నగదు పంపిణీ, మద్యం సరఫరాతో ఓట‌ర్ల‌ను ప్ర‌భావ పెట్ట‌డంపై ఎస్ఈసీ ఫిర్యాదులు అందుకుంటోంది.

అక్ర‌మ కార్య‌క‌లాపాల‌పై ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నట్టు ఎస్‌ఈసీ తెలిపింది. ప్ర‌త్యేకంగా విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి నుంచి ఫిర్యాదులు ఎక్కువ వ‌స్తుండ‌డంతో ఆయా ప్రాంతాలపై దృష్టి పెట్టిన‌ట్లు వివ‌రించింది.

వీటిపై కాసేప‌ట్లో రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన అధికారి నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్ అధికారుల‌తో వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో స‌మావేశం కానున్నారు. డ‌బ్బు ప్ర‌వాహంపై ఆదాయపు పన్నుశాఖతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రత్యేక దృష్టి సారించాలని ఇప్పటికే ఎస్‌ఈసీ సూచ‌న‌లు చేసింది.

మ‌రోవైపు, చిత్తూరులో ఎన్నికలను నిలిపివేయాలని హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్‌ దాఖలైంది. ఆ జిల్లాలోని 18 డివిజన్లలో టీడీపీ అభ్యర్థుల నామినేషన్లను ఫోర్జరీతో విత్ డ్రా చేశారని ఆ పార్టీ అభ్యర్థుల తరఫున న్యాయవాది కృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈ రోజు విచార‌ణ జ‌ర‌గ‌నుంది.