రెండో టెస్టులో రోహిత్ సెంచరీ సిరీస్ ను మలుపు తిప్పింది: కోహ్లీ

06-03-2021 Sat 19:24
  • ఇంగ్లండ్ తో ముగిసిన టెస్టు సిరీస్
  • 3-1తో సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
  • తొలి టెస్టు ఓటమి తర్వాత వరుసగా మూడు టెస్టుల్లో జయభేరి
  • రెండో టెస్టులో రోహిత్ 161 పరుగులు
  • అక్కడ్నించే తాము పుంజుకున్నామన్న కోహ్లీ
Kohli says Rohit ton in second test turns the tables for Team India in the series

టీమిండియా ఆడిన టెస్టు సిరీస్ ల్లో మరో విజయవంతమైన సిరీస్ ముగిసింది. ఇంగ్లండ్ పై 4 టెస్టుల సిరీస్ ను కోహ్లీ సేన 3-1తో నెగ్గింది. ఈ సిరీస్ లో చెన్నైలో జరిగిన తొలి టెస్టులో భారత్ పరాజయం చవిచూసింది. అయితే రెండో టెస్టు నుంచి పుంజుకున్న టీమిండియా వరుసగా 3 టెస్టుల్లోనూ ఇంగ్లండ్ ను మట్టికరిపించింది. ఇవాళ అహ్మదాబాద్ లో ముగిసిన టెస్టులో ప్రత్యర్థిని ఇన్నింగ్స్ తేడాతో ఓడించిన అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ తన అభిప్రాయాలు వెల్లడించాడు.

తొలి టెస్టు ఓటమి నేపథ్యంలో రెండో టెస్టులో గెలుపు తప్పనిసరి అనే పరిస్థితిలో బరిలో దిగామని, మిగతా బ్యాట్స్ మెన్ రాణించకపోయినా ఓపెనర్ రోహిత్ శర్మ సాధించిన అద్భుతమైన సెంచరీ ఆ మ్యాచ్ లో విజయానికి బాటలు వేసిందని వివరించాడు. సిరీస్ మలుపు తిరిగింది అక్కడేనని పేర్కొన్నాడు. బ్యాటింగ్ కు కష్టసాధ్యంగా మారిన పిచ్ పై రోహిత్ శర్మ 150కి పైగా పరుగులు చేయడం, తాము 250 పరుగులకు పైగా స్కోరు సాధించడం తమను రేసులో నిలిపిందని వెల్లడించాడు. ఈ సిరీస్ ఆసాంతం రోహిత్ శర్మ కీలక ఇన్నింగ్స్ లతో, భాగస్వామ్యాలతో తన బాధ్యతను సమర్థంగా నిర్వర్తించాడని కితాబునిచ్చారు.

కాగా, ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ ను టీమిండియా 3-1తో చేజిక్కించుకోవడంతో ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. ఈ చాంపియన్ షిప్ లీగ్ దశను నెంబర్ వన్ పొజిషన్ తో ముగించింది. ఇప్పటికే ఫైనల్ చేరిన న్యూజిలాండ్ ను భారత్ జూన్ 18న ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఎదుర్కోనుంది.