100 కోట్ల క్లబ్బులో 'ఉప్పెన'.. నిర్మాతల అధికారిక ప్రకటన!

06-03-2021 Sat 16:32
  • వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి జంటగా 'ఉప్పెన' 
  • బుచ్చిబాబు దర్శకత్వంలో ప్రేమకథ
  • తొలిరోజు నుంచే సూపర్ హిట్ టాక్
  • అనుకున్నట్టుగానే 100 కోట్ల గ్రాస్  
Uppena joins Hundred crore club

లాక్ డౌన్ తర్వాత.. థియేటర్లు తెరుచుకున్నాక.. ప్రేక్షకులు థియేటర్లకు వస్తారో రారో అన్న మీమాంసలో వున్న నిర్మాతలకు, సినిమాలో దమ్ముంటే తప్పకుండా వస్తారు అని నిరూపించిన చిత్రం 'ఉప్పెన'. సరికొత్త కథను వైవిధ్యంతో తీస్తే కనుక ప్రేక్షకులు ఆదరిస్తారన్న విషయాన్ని మరోసారి నిరూపించింది.

దీని ద్వారా మెగాస్టార్ చిరంజీవి మరో మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా .. బుచ్చిబాబు దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. ఈ చిత్రంలో తమిళ నటుడు విజయ్ సేతుపతి ఓ కీలక పాత్ర పోషించగా.. కృతి శెట్టి కథానాయికగా తెలుగుతెరకు పరిచయమైంది. ఇక సినిమా విడుదల కాగానే, సూపర్ హిట్ అన్న టాక్ ఏకగ్రీవంగా వచ్చేసింది. ప్రేమకథల్లో ఒక సంచలనంగా నిలిచింది.

సినిమాకు లభిస్తున్న ఆదరణను చూసి.. 'ఇది 100 కోట్ల సినిమా' అంటూ మొదటి రోజే కొందరు జోస్యం చెప్పారు. అనుకున్నట్టుగానే ఇప్పుడది నిజమైంది. తమ సినిమా 100 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిందని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ రోజు అధికారికంగా ప్రకటించింది. 'ఉప్పెనంత మీ ప్రేమకు ధన్యవాదాలు' అంటూ ఓ పోస్టర్ ను కూడా సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది.