భళా భారత్... అహ్మదాబాద్ టెస్టులో ఇంగ్లండ్ పై ఘనవిజయం... వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్స్ చేరిక

06-03-2021 Sat 16:20
  • మూడ్రోజుల్లోనే ముగిసిన నాలుగో టెస్టు
  • రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 135 ఆలౌట్
  • ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో భారత్ జయభేరి
  • 4 టెస్టుల సిరీస్ 3-1తో కైవసం
  • లార్డ్స్ లో న్యూజిలాండ్ తో అమీతుమీకి సిద్ధం
India victorious in Ahmedabad test against England

విరాట్ కోహ్లీ సారథ్యంలో టీమిండియా అహ్మదాబాద్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో ఇంగ్లండ్ పై ఘనవిజయం సాధించింది. అన్ని రంగాల్లో విశేషంగా రాణించిన భారత్ ఇన్నింగ్స్ 25 పరుగుల భారీ తేడాతో టెస్టును గెలుచుకుంది. 160 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 135 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా స్పిన్ ద్వయం అశ్విన్, అక్షర్ మరెవ్వరికీ అవకాశం ఇవ్వకుండా వికెట్లన్నీ ఇద్దరే పంచుకున్నారు. చెరో 5 వికెట్లు సాధించి భారత్ విజయంలో ప్రధానభూమిక పోషించారు.

ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో డాన్ లారెన్స్ చేసిన 50 పరుగులే అత్యధికం. కెప్టెన్ జో రూట్ 30 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొదట బ్యాటింగ్ చేసి తొలి ఇన్నింగ్స్ లో 205 పరుగులకు ఆలౌటైంది. బదులుగా భారత్ తొలి ఇన్నింగ్స్ లో 365 పరుగులు చేసి 160 పరుగుల ఆధిక్యం సాధించింది. అయితే టీమిండియా స్పిన్ ఉచ్చులో చిక్కుకున్న ఇంగ్లండ్ మోసారి విలవిల్లాడింది.

కాగా, ఈ విజయంతో భారత్ వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్స్ కు అర్హత సాధించింది. 4 టెస్టుల సిరీస్ ను 3-1తో కైవసం చేసుకుని, లార్డ్స్ మైదానంలో జరిగే వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్స్ లో సగర్వంగా అడుగుపెట్టింది. ఈ ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు న్యూజిలాండ్ తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్ జూన్ 18 నుంచి 22 వరకు జరగనుంది.