సుప్రీంకోర్టులో ‘హైబ్రిడ్​’ విధానంలో విచారణ!

06-03-2021 Sat 14:12
  • భౌతిక విచారణతో పాటు ఆన్ లైన్ వాదనలు
  • మంగళ, బుధ, గురువారాలు కేటాయింపు
  • చివరి దశలో ఉన్న కేసులకు వర్తింపు
  • ఎలా విచారించాలన్నది ధర్మాసనం ఇష్టం
  • సోమ, శుక్రవారాల్లో కేవలం ఆన్ లైన్ విచారణ
Supreme Court To Switch To Hybrid Mode To Hear Cases From March 15

కరోనాతో దాదాపు ఏడాదిన్నర పాటు సుప్రీం కోర్టులో సాగని భౌతిక విచారణలు.. త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి. అయితే, ఈ విషయంలో అత్యున్నత న్యాయ స్థానం ఓ ప్రయోగం చేయబోతోంది. ‘హైబ్రిడ్’ విచారణలకు అవకాశం కల్పించనుంది. కరోనా వ్యాక్సినేషన్ రెండో దశ మొదలు కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం సుప్రీం కోర్టు రిజిస్ట్రీ దీనిపై ఉత్తర్వులు ఇచ్చింది.

‘హైబ్రిడ్’ విధానంలో భాగంగా ఇటు భౌతిక విచారణతో పాటు (ఫిజికల్ హియరింగ్స్) ఆన్ లైన్ విచారణను కొనసాగించాలని నిర్ణయించింది. మార్చి 15 నుంచి ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురాబోతోంది. అందులో భాగంగా మంగళ, బుధ, గురువారాల్లో చివరి దశలో ఉన్న కేసులను రెండు పద్ధతుల్లో విచారించనుంది.

అందుబాటులో ఉన్న కోర్టు గదులు, విచారణకు వచ్చే పార్టీల సంఖ్యను బట్టి ధర్మాసనం ఏ విధానంలో విచారించాలో నిర్ణయిస్తుందని రిజిస్ట్రీ పేర్కొంది. సోమవారం, శుక్రవారం మాత్రం పూర్తిగా ఆన్ లైన్ లోనే కేసులను విచారిస్తుందని తెలిపింది.