కేటీఆర్ పీఏనంటూ మోసాలు... మాజీ రంజీ క్రికెటర్ అరెస్ట్

06-03-2021 Sat 14:04
  • వ్యాపారవేత్తలకు టోకరా
  • కేటీఆర్ పీఎనంటూ లక్షల్లో వసూళ్లు
  • ఇప్పటివరకు రూ.39 లక్షలు వసూలు
  • నాగరాజును అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు
  • రూ.10 లక్షలు స్వాధీనం
Task Force arrests former Ranji cricketer Nagaraju in cheating case

ఆంధ్రా మాజీ రంజీ క్రికెటర్ బుడుమూరి నాగరాజును హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ పీఏగా చెప్పుకుంటూ నాగరాజు మోసాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. నాగరాజు అనేక కార్పొరేట్ ఆసుపత్రులు, వ్యాపారవేత్తలకు ఫోన్ చేసి తనను తాను కేటీఆర్ పీఏనని చెప్పుకునేవాడని, ఆపై వారి నుంచి డబ్బు వసూలు చేసేవాడని టాస్క్ ఫోర్స్ సిబ్బంది తెలిపారు. నాగరాజు ఆ విధంగా రూ.39 లక్షలు వసూలు చేసినట్టు తెలుసుకున్నారు. అరెస్ట్ చేసిన సందర్భంగా అతడి నుంచి రూ.10 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

గతంలోనూ నాగరాజుపై పలు చీటింగ్ కేసులు నమోదయ్యాయి. బెయిల్ పై వచ్చినప్పటికీ మళ్లీ మోసాలు చేయడం పరిపాటిగా మారింది. నాగరాజు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా యవ్వారిపేట. విలాసాల మోజులో అతడు పెడతోవ పట్టినట్టు భావిస్తున్నారు.