లింగుస్వామి సినిమాలో కృతిశెట్టి.. అధికారిక ప్రకటన!

05-03-2021 Fri 21:50
  • 'ఉప్పెన'తో పరిచయమైన కృతిశెట్టి 
  • లింగుస్వామి దర్శకత్వంలో రామ్ 
  • కృతికి వెల్కమ్ చెబుతూ పోస్టర్    
Kruti Shetty under Lingusamy direction

ఒక సినిమా సక్సెస్ అయితే అందులో భాగస్వాములైన చాలామందికి ఆఫర్లు వెతుక్కుంటూ వస్తాయి. ముఖ్యంగా హీరో.. హీరోయిన్.. దర్శకుడు.. మంచి అవకాశాలు పొందుతుంటారు. ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన 'ఉప్పెన' సినిమా కూడా ఇప్పుడు అలాంటి ఆఫర్లే తెస్తోంది. ముఖ్యంగా ఇందులో హీరోయిన్ గా నటించిన తాజా బ్యూటీ కృతిశెట్టి పలు ఆఫర్లు అందుకుంటోంది.

'ఉప్పెన' రిలీజ్ కాకుండానే నాని సరసన 'శ్యామ్ సింగ రాయ్' సినిమాలో కథానాయికగా ఛాన్స్ కొట్టేసిన ఈ ముద్దుగుమ్మకు తాజాగా రామ్ పక్కన నటించే అవకాశం కూడా వచ్చింది. ప్రముఖ తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో రామ్ హీరోగా ఓ సినిమా రూపొందనుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కథానాయికగా కృతి శెట్టిని ఎంపిక చేశారు. ఈ విషయాన్ని ఈ రోజు అధికారికంగా చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. కృతి శెట్టికి తమ టీమ్ లోకి వెల్కమ్ చెబుతూ సోషల్ మీడియాలో ఈ రోజు ఓ పోస్టర్ ను విడుదల చేశారు.