India: ఉత్పత్తి పెంచాలని ఒపెక్ దేశాలను కోరిన భారత్... గతేడాది చవకగా కొనుగోలు చేసిన చమురు వాడుకోవాలన్న సౌదీ

Saudi suggests India use last year purchased crude
  • భారత్ లో మండిపోతున్న చమురు ధరలు
  • వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న ఒపెక్ దేశాలు
  • ఉత్పత్తి పునరుద్ధరించాలన్న కేంద్రం
  • వ్యంగ్యంగా సమాధానమిచ్చిన సౌదీ మంత్రి
దేశంలో ఇంధన ధరలు భగ్గుమంటున్న నేపథ్యంలో చమురు ఉత్పత్తి పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఒపెక్ (పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ) దేశాలను కోరింది. అయితే, ఒపెక్ దేశాల్లో కీలకమైన సౌదీ అరేబియా చాలా వ్యంగ్యంగా సమాధానమిచ్చింది. గతేడాది తమ నుంచి అత్యంత చవకగా కొనుగోలు చేసి దాచుకున్న చమురును ఇప్పుడు బయటికి తీసి వాడుకోవాలని సూచించింది.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో నెలకొన్న సంక్షోభం రీత్యా ఒపెక్ దేశాలు చమురు ఉత్పత్తిలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఈ దేశాలు లాభాపేక్షతో వ్యవహరిస్తూ పరిమిత మొత్తంలో చమురును ఉత్పత్తి చేస్తుండడంతో ఇంధనాన్ని అధికమొత్తంలో దిగుమతి చేసుకునే భారత్ వంటి దేశాల్లో పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి.

ఒపెక్ సభ్యదేశాలతో సమావేశం సందర్భంగా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉత్పత్తిని పునరుద్ధరించాలని కోరారు. ధరల స్థిరీకరణ చేస్తామని ప్రజలకిచ్చిన హామీ నెరవేర్చడంలో సహకరించాలని ఆయా దేశాలకు విజ్ఞప్తి చేశారు.

అందుకు సౌదీ అరేబియా ఇంధన శాఖ మంత్రి ప్రిన్స్ అబ్దులజీజ్ బిన్ సల్మాన్ స్పందిస్తూ... భారత్ కిందటేడాది తమ నుంచి అతి తక్కువ ధరలకే భారీ మొత్తంలో చమురు కొనుగోలు చేసి నిల్వ చేసిందని వెల్లడించారు. ఇప్పుడా నిల్వల నుంచి చమురును బయటికి తీసి ఉపయోగించుకోవాలని అన్నారు. తమ మిత్రదేశం భారత్ ఎదుర్కొంటున్న సమస్యకు ఇంతకంటే తరుణోపాయం లేదన్నారు.
India
Petrlium
Crude
Opec
Saudi Arabia

More Telugu News