పీసీసీ, ప్రచార కమిటీ పదవులు ఒకే సామాజికవర్గానికి ఇవ్వొద్దని రాహుల్ ని కోరాను: మధుయాష్కీ

05-03-2021 Fri 20:25
  • ఢిల్లీలో రాహుల్ ని కలిసిన మధుయాష్కీ
  • తెలంగాణలో పార్టీ పరిస్థితులపై వివరించిన వైనం
  • రాష్ట్ర పర్యటనకు రావాలని విన్నపం
Madhu Yashki meets Rahul Gandhi

టీపీసీసీకి కొత్తగా ఏర్పాటు చేయబోయే కమిటీలో సామాజిక న్యాయం ఉండేలా చూడాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఆ పార్టీ మాజీ ఎంపీ మధుయాష్కీ కోరారు. కమిటీలో కీలకమైన అధ్యక్షుడు, ప్రచార కమిటీ ఛైర్మన్ పదవులను ఒకే సామాజికవర్గానికి ఇవ్వొద్దని సూచించారు.

రాహుల్ ని ఢిల్లీలో మధుయాష్కీ కలిశారు. తెలంగాణలో పార్టీ పరిస్థితులపై ఆయనకు వివరించారు. పీసీసీ కమిటీ ఏర్పాటుకు సంబంధించి తన అభిప్రాయాలను పంచుకున్నారు. తెలంగాణలో పర్యటించాలని, రాష్ట్ర నేతలతో సమావేశం కావాలని కోరారు.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాహుల్ గాంధీ ప్రచారపర్వంలో బిజీగా ఉన్నారని... ఈ నేపథ్యంలో ఎన్నికలు పూర్తయిన వెంటనే తెలంగాణ పర్యటనను ఖరారు చేస్తానని ఆయన చెప్పారని మధుయాష్కీ తెలిపారు. నాగార్జునసాగర్ ఉపఎన్నిక అయిన తర్వాత పీసీసీని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.