అంబానీ ఇంటివద్ద పేలుడు పదార్థాలతో కలకలం రేపిన వాహనం యజమాని ఆత్మహత్య

05-03-2021 Fri 19:55
  • స్కార్పియో యజమాని మన్ సుఖ్ హిరెన్ ఆత్మహత్య
  • ముంబై సమీపంలోని వాగులో మృతదేహం గుర్తింపు
  • వంతెనపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడన్న పోలీసులు
Owner of vehicle parked with explosives near Mukhesh Ambanis residence found dead

ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ ఇంటి వద్ద ఇటీవల పేలుడు పదార్థాలు ఉన్న ఓ వాహనం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 25న అంబానీ ఇంటికి సమీపంలో ఓ స్కార్పియో వాహనాన్ని పార్క్ చేసి ఉంచారు. దీంతో ఆ వాహనాన్ని చెక్ చేయగా అందులో జిలెటిన్ స్టిక్స్ లభ్యమయ్యాయి. అంతేకాదు ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీకి రాసిన ఒక లేఖ కూడా అందులో దొరికింది. ఈ నేపథ్యంలో ఆ వాహనం యజమాని మన్ సుఖ్  హిరెన్ ఇప్పుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముంబైకి సమీపంలోని ఓ వాగులో అతని మృతదేహాన్ని ఈరోజు గుర్తించారు. వంతెనపై నుంచి దూకి అతను ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

మరోవైపు అంబానీ ఇంటి వద్ద ఉన్న స్కార్పియో వాహనం అంతకు ముందే చోరీకి గురైనట్టు పోలీసులు గుర్తించారు. ఆ వాహనాన్ని తామే అక్కడ ఉంచినట్టు జైష్ ఉల్ హింద్ సంస్థ ప్రకటించుకుంది. అయితే, ఆ ఘటనకు ఆ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు స్పష్టం చేశారు. మరోవైపు హిరెన్ ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.