సిక్స్ తో సెంచరీ సాధించిన పంత్.. తర్వాతి ఓవర్లోనే అవుట్!

05-03-2021 Fri 17:00
  • అహ్మదాబాద్ లో భారత్-ఇంగ్లండ్ టెస్టు
  • 101 పరుగులు చేసిన పంత్
  • టెస్టు కెరీర్ లో మూడో సెంచరీ నమోదు
  • సుందర్ తో కలిసి విలువైన భాగస్వామ్యం
  • అర్ధసెంచరీతో ఆడుతున్న సుందర్
Pant reaches century with a massive six

టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ మరోమారు తన బ్యాట్ పవర్ రుచి చూపించాడు. అహ్మదాబాద్ లో ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టులో పంత్ ధాటిగా ఆడుతూ సిక్స్ తో శతకం అందుకున్నాడు. అయితే ఆ తర్వాతి ఓవర్లోనే ఆండర్సన్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. పంత్ కు టెస్టుల్లో ఇది మూడో సెంచరీ. ఈ ఎడమచేతివాటం ఆటగాడు 118 బంతులాడి 13 ఫోర్లు, 2 సిక్స్ లతో 101 పరుగులు చేశాడు.

ఈ ఇన్నింగ్స్ లో పంత్ చేసిన 101 పరుగుల విలువ అంతాఇంతా కాదు. ఈ మ్యాచ్ లో టీమిండియాను పటిష్ఠ స్థితిలో నిలిపింది ఈ పరుగులే అనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 92 ఓవర్లలో 7 వికెట్లకు 292 పరుగులు కాగా, తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 87 పరుగులకు చేరుకుంది. ప్రస్తుతం క్రీజులో వాషింగ్టన్ సుందర్ (58 బ్యాటింగ్), అక్షర్ పటేల్ (11 బ్యాటింగ్) ఉన్నారు. కీలక సమయంలో సుందర్ కూడా అర్ధసెంచరీ నమోదు చేసి ఆల్ రౌండర్ గా ఎదుగుతున్న సంకేతాలు అందించాడు.