డీజీపీపై చంద్రబాబు వ్యాఖ్యలు ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిఫలిస్తున్నాయి: ఏపీ పోలీసు అధికారుల సంఘం

05-03-2021 Fri 16:45
  • సవాంగ్ పై చంద్రబాబు వ్యాఖ్యలకు ఖండన
  • ప్రెస్ నోట్ విడుదల చేసిన ఏపీ పోలీసు అధికారుల సంఘం
  • చంద్రబాబు వ్యాఖ్యలు అనైతికమని వ్యాఖ్య 
  • టీడీపీ ఓటమికి పోలీసులదే బాధ్యత అనడం భావ్యంకాదని హితవు
AP Police Officers Association condemns Chandrababu comments on AP DGP Gautam Sawang

టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ పై చేసిన వ్యాఖ్యల పట్ల ఏపీ పోలీసు అధికారుల సంఘం స్పందించింది. డీజీపీపై చంద్రబాబు వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు స్పష్టం చేసింది. పంచాయతీ ఎన్నికల్లో పరాజయం నేపథ్యంలో చంద్రబాబు పరిస్థితిని అర్థం చేసుకోగలమని వ్యాఖ్యానించింది. అయితే, ఎన్నికల్లో ఓటమికి పోలీసు శాఖదే బాధ్యత అనడం భావ్యమేనా? అని ప్రశ్నించింది.

పోలీసులపై చంద్రబాబు వ్యతిరేకత కొత్తేమీ కాదని పేర్కొంది. డీజీపీని, పోలీసులను బెదిరిస్తూ కుల, ప్రాంతీయ భావాలు రేకెత్తించి తమ స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయొద్దని పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ మీడియా ప్రకటన విడుదల చేశారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో 14 ఏళ్లు సీఎంగా ఉన్న మీరు డీజీపీపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసంగా లేదని అభిప్రాయపడ్డారు. డీజీపీపై చేసిన ఆరోపణలను తాము చంద్రబాబు వ్యక్తిత్వానికి ప్రతీకలుగానే భావిస్తామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

గౌతమ్ సవాంగ్ గతంలో టీడీపీ ప్రభుత్వంలోనూ పనిచేశారని, అప్పుడు ఆయన కులం, మతం గుర్తుకురాలేదా? అని ప్రశ్నించారు. 35 ఏళ్లుగా ఐపీఎస్ అధికారిగా ప్రజలకు సేవలు అందిస్తున్న సవాంగ్ పై చంద్రబాబు ఈ విధంగా ఆరోపణలు చేయడం దురదృష్టకరమని తెలిపారు. ఈ వ్యాఖ్యలను అనైతికమని తాము భావిస్తున్నామని, మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కోర్టులను ఆశ్రయించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.