అరుణగ్రహం చిత్రాలను పంపిన చైనా వ్యోమనౌక

05-03-2021 Fri 09:02
  • గత నెల 24న అంగారక కక్షలోకి తియాన్వెన్-1
  • మూడు చిత్రాలు పంపిన ప్రోబ్
  • 620 మీటర్ల చుట్టుకొలతతో అతిపెద్ద బిలం
Chinas Mars Probe Tianwen 1 Captures High Resolution Photos

అరుణగ్రహానికి చెందిన మూడు హై-డెఫినిషన్ చిత్రాలను చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (సీఎన్ఎస్ఏ) నిన్న విడుదల చేసింది. ఇందులో రెండు పాన్‌క్రోమాటిక్ (అన్ని రంగులను గుర్తించగలిగిన) చిత్రాలు కాగా, ఒకటి వర్ణ చిత్రం. వీటిని చైనా మార్స్ ప్రోబ్ తియాన్వెన్-1 తీసింది.

 హై రిజల్యూషన్ కెమెరాలను ఉపయోగించి 330-350 కిలోమీటర్ల ఎత్తు నుంచి మార్స్ ఉపగ్రహాన్ని చిత్రీకరించింది. ఈ ఫొటోల్లో అంగారకుడిపై ఉన్న బిలాలు, పర్వత పంక్తులు, ఇసుక తిన్నెలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇందులో అతిపెద్ద బిలం 620 మీటర్ల చుట్టుకొలతతో ఉంది. తియాన్వెన్ చిత్రీకరించిన వర్ణ చిత్రం అంగారకుడి ధృవప్రాంతానికి చెందినది. దీనిని మీడియం రిజల్యూషన్ కెమెరాతో చిత్రీకరించింది.

   అంగారకుడిపై పరిశోధనల కోసం చైనా పంపిన తియాన్వెన్-1 ప్రోబ్ గత నెల 24న అంగారక కక్ష్యలో ప్రవేశించింది. మే లేదంటే జూన్ నెలలో ఈ ప్రోబ్‌లోని ల్యాండర్, రోవర్‌లు గ్రహం దక్షిణార్ధగోళంలోని ఉటోపియా ప్లానీషియా అనే ప్రాంతంలో దిగి మరిన్ని పరిశోధనలు చేపడతాయి.