Venkaiah Naidu: కోర్టుల్లో వాద, ప్రతివాదనలు కూడా మాతృభాషలోనే జరగాలి: వెంకయ్యనాయుడు

Venkaiah Naidu attends Tirupati IIT sixth institutional day celebrations
  • తిరుపతి ఐఐటీ 6వ వ్యవస్థాపక దినోత్సవం
  • ముఖ్య అతిథిగా వెంకయ్యనాయుడు
  • మాతృభాష వినియోగంపై మాట్లాడిన వైనం
  • ప్రాథమిక స్థాయి ఉంచి విద్యాబోధన మాతృభాషలోనే జరగాలని అభిలాష
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాతృభాష వినియోగంపై గట్టిగా పోరాడేవారిలో ముందువరుసలో ఉంటారు. సందర్భం వచ్చిన ప్రతిసారి ఆయన మాతృభాష ప్రాముఖ్యతను చాటేందుకు ప్రయత్నిస్తుంటారు. నేడు తిరుపతి ఐఐటీ 6వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాతృభాషపై తన అభిప్రాయాలు వెల్లడించారు.

ప్రాథమిక స్థాయి నుంచి విద్యాబోధన మాతృభాషలోనే జరగాలని అభిలషించారు. దేశంలోని అన్ని ప్రధాన సాహిత్యాలు, వైద్య, ఇంజినీరింగ్ పరిశోధన గ్రంథాలను ప్రాంతీయ భాషల్లోకి అనువదిస్తే వాటి ఫలితాలు అందరికీ అందుతాయని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పరిపాలన స్థానిక ప్రజల వాడుక భాషలోనే జరగాలని అన్నారు. కోర్టుల్లో జరిగే వాదోపవాదాలు కూడా మాతృభాషలోనే జరగాలని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

పూర్వీకులు అందించిన సాంస్కృతిక వారసత్వాన్ని భావితరాలకు అందించే బాధ్యత విద్యార్థులపైనే ఉందని, సామాజిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు విజ్ఞానాన్ని పెంచుకోవాలని సూచించారు. మాతృభాషను, తల్లిదండ్రులను, మాతృదేశాన్ని, విద్యను అభ్యసించిన సంస్థను, చదువు నేర్పిన గురువులను మర్చిపోరాదని తెలిపారు. ఇక, తిరుపతి ఐఐటీ గురించి మాట్లాడుతూ, ఆరేళ్ల కిందట తానే ఈ విద్యాసంస్థకు శంకుస్థాపన చేశానని, కొన్నేళ్లలోనే అభివృద్ధి పథంలో పయనిస్తుండడం సంతోషం కలిగిస్తోందని తెలిపారు.
Venkaiah Naidu
Tirupati IIT
Institutional Day
Mother Tongue
Mother Language

More Telugu News