నేటి నుంచి సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోనూ కరోనా టీకా పంపిణీ

04-03-2021 Thu 09:15
  • టీకాకు ప్రజల నుంచి అనూహ్య స్పందన
  • 90 శాతానికి పైగా లబ్ధిదారులకు టీకా
  • నేటి నుంచి 195 ప్రైవేటు ఆసుపత్రుల్లో పంపిణీ
  • టీకా పరిమితి గరిష్టంగా 800 మందికి పెంపు
From Today Onwards Corona Vaccination drive starts in PHCs

తెలంగాణలో కరోనా టీకా వేయించుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం రెండో దశ పంపిణీ జరుగుతోంది. 60 ఏళ్లు పైబడిన వారితోపాటు 45 ఏళ్లు దాటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి టీకాలు వేస్తున్నారు. తొలుత అంతగా ఆసక్తి చూపని ప్రజలు ఇప్పుడు టీకాలు వేయించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. గత మూడు రోజుల్లో 90 శాతానికి పైగా లబ్ధిదారులు టీకాలు వేయించుకోవడం గమనార్హం.

ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుండడంతో నేటి నుంచి సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోనూ టీకాను పంపిణీ చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. అలాగే, స్పందన ఎక్కువగా ఉన్న కార్పొరేట్ ఆసుపత్రుల్లో కేంద్రాల సంఖ్యతోపాటు రోజువారీ టీకాల పరిమితిని కూడా పెంచారు. ప్రస్తుతం 121 ప్రైవేటు ఆసుపత్రులలో టీకా పంపిణీ జరుగుతుండగా, నేటి నుంచి వాటి సంఖ్య 195కు పెరగనుంది. రోజుకు 100 మందికి టీకాలు వేయాలన్న పరిమితిని 400-800కు పెంచామని, మున్ముందు మరిన్ని ప్రైవేటు ఆసుపత్రులకు టీకా పంపిణీకి అనుమతులు ఇవ్వనున్నట్టు ప్రజారోగ్య డైరెక్టర్ డాక్టర్ జి.శ్రీనివాసరావు తెలిపారు.