కీరన్ పొలార్డ్ అరుదైన ఘనత.. గిబ్స్, యువరాజ్ సరసన చేరిక

04-03-2021 Thu 09:03
  • శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఆరు వరుస సిక్సర్లు
  • అఖిల ధనంజయ బౌలింగును ఉతికి ఆరేసిన ఆల్‌రౌండర్
  • లంకపై విండీస్ ఘన విజయం
Kieron Pollard smashes six sixes in an over

టీ20ల్లో మరో రికార్డు నమోదైంది. శ్రీలంకతో గత రాత్రి జరిగిన టీ20 మ్యాచ్‌లో విండీస్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ చెలరేగిపోయాడు. అఖిల ధనంజయ బౌలింగులో ఆరు బంతులను వరుసగా స్టాండ్స్‌లోకి పంపి గిబ్స్, యువరాజ్ సరసన చేరాడు.

 ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. అనంతరం 132 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ పొలార్డ్ మెరుపులతో 13.1 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. మొత్తం 11 బంతులు ఆడిన పొలార్డ్ 38 పరుగులు చేశాడు. అందులో 36 పరుగులు సిక్సర్ల ద్వారా వచ్చినవే కావడం గమనార్హం. ధనంజయ బౌలింగ్‌ను చితకబాదిన పొలార్డ్ ఆ తర్వాతి ఓవర్‌లోనే అవుటయ్యాడు.

దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు హర్ష్‌లీ గిబ్స్ 2007లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాది ప్రపంచ రికార్డు సృష్టించాడు. అదే ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టాడు. ఇప్పుడు పొలార్డ్ శ్రీలంకపై ఆ ఘనత సాధించాడు. ఫలితంగా ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన మూడో ఆటగాడిగా, టీ20ల్లో రెండో ఆటగాడిగా తన పేరును లిఖించుకున్నాడు.