12వ అంతస్తు నుంచి పడిన చిన్నారి.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో ఇది!

03-03-2021 Wed 21:05
  • అరుపులు విని అప్రమత్తమైన భవనం కిందనున్న వ్యక్తి
  • కిందపడుతున్న చిన్నారిని అమాంతం ఒడిసిపట్టుకున్న వైనం
  • ఇద్దరికీ స్వల్ప గాయాలు
Delivery Driver Catches Toddler Who Fell From 12th Storey

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో జనాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. 12వ అంతస్తు నుంచి ఓ చిన్నారి అమాంతం కిందపడగా, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఊపిరి బిగబట్టేలా చేశాయి. వియత్నాంలోని హనోయ్‌లో ఉన్న ఓ భవనంలోని 12 అంతస్తు కిటికీ నుంచి చిన్నారి బయటకు వచ్చింది. బయటకు వచ్చాక భయంతో బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టింది. ఆమెను రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో మిగతావారు కూడా కేకలు వేయడం మొదలుపెట్టారు.

అదే సమయంలో భవనం కింద ఏదో పనిపై ఎదురుచూస్తున్న గుయెన్ గోక్ మాన్ష్ ఆ అరుపులు విన్నాడు. అయితే, ఎవరో పాప ఏడుస్తోందని భావించి పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత మిగతా వారి కేకలు కూడా వినిపించడంతో పైకి చూసిన అతడికి గుండె ఆగినంత పనైంది. వెంటనే అప్రమత్తమయ్యాడు.

పాప ఎటువైపు పడుతుందో క్షణాల్లోనే అంచనా వేశాడు. పక్కనే ఉన్న మెటాలిక్ పైకప్పును అతికష్టం మీద ఎక్కాడు. ఆ వెంటనే ఆ చిన్నారి అతడి చేతుల్లో పడింది. పాపను గట్టిగా ఒడిసిపట్టుకోవడంతో ఎలాంటి ప్రమాదం లేకుండా చిన్నారి బయటపడింది. అయితే, చిన్నారి పడిన వేగానికి పట్టుతప్పడంతో ఇద్దరికీ స్వల్పంగా గాయాలయ్యాయి. ఈ ఘటన చూస్తున్న వారి గుండెలు అదిరిపోయాయి. ఇద్దరూ క్షేమంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడీ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.