ఐపీఎల్ ను తక్కువ చేసి చూపాలన్నది నా ఉద్దేశం కాదు: డేల్ స్టెయిన్

03-03-2021 Wed 18:07
  • ఐపీఎల్ లో డబ్బే ప్రధానం అంటూ స్టెయిన్ పై వ్యాఖ్యలు
  • క్రికెట్ ను పట్టించుకోరని వెల్లడి
  • స్టెయిన్ పై తీవ్ర విమర్శలు
  • క్షమాపణలు చెప్పిన స్టెయిన్
  • ఆటను విస్మరిస్తున్నారన్న కోణంలో వ్యాఖ్యానించానని వివరణ
Dale Steyn explains his comments on IPL

సఫారీ పేస్ బౌలింగ్ దిగ్గజం డేల్ స్టెయిన్ ఐపీఎల్ పై తాను చేసిన వ్యాఖ్యల పట్ల వివరణ ఇచ్చాడు. ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో ఆడుతున్న స్టెయిన్... ఐపీఎల్ లో ఎక్కువగా డబ్బు గురించే చర్చ జరుగుతుందని పేర్కొన్నాడు. ఏ ఆటగాడు ఎంతకు అమ్ముడయ్యాడన్నదే అక్కడ చర్చనీయాంశమని వ్యాఖ్యానించాడు. అసలు విషయం అయిన క్రికెట్ ను ఐపీఎల్ లో విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. దాంతో స్టెయిన్ పై విమర్శల జడివాన కురిసింది. తన వ్యాఖ్యలతో రేగిన దుమారం పట్ల స్టెయిన్ తాజాగా స్పందించాడు.

ఐపీఎల్ పై తాను చేసిన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు తెలుపుతున్నానని వెల్లడించాడు. ఐపీఎల్ ను తక్కువ చేసి చూపడం కానీ, ఇతర లీగ్ లతో పోల్చి అవమానించడం కానీ తన ఉద్దేశం కాదని స్పష్టం చేశాడు. ఐపీఎల్ డబ్బు గురించే అందరూ మాట్లాడుకుంటూ క్రికెట్ ను విస్మరిస్తున్నారని తాను చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో విపరీతార్థంతో ప్రచారం చేశారని స్టెయిన్ ఆరోపించాడు. తన కెరీర్ లోనే కాకుండా, ఇతర ఆటగాళ్ల కెరీర్ లోనూ ఐపీఎల్ ఓ అద్భుతమనడంలో సందేహం లేదని పేర్కొన్నాడు. తన వ్యాఖ్యల పట్ల ఎవరైనా నొచ్చుకుంటే అందుకు మన్నించాలని కోరాడు.