ముంబైలో ఇంటి కోసం చూస్తున్న ప్రభాస్!

03-03-2021 Wed 16:17
  • ముంబైలో మొదలైన 'ఆదిపురుష్' షూటింగ్ 
  • ప్రతి నెలా ప్రభాస్ పదిహేను రోజుల డేట్స్
  • ఫ్లాట్ కొనుగోలుకు ప్రయత్నిస్తున్న టీమ్  
Prabhas to buy a flat in Mumbai

ఇటీవలే కథానాయిక రష్మిక ముంబైలో ఇల్లు కొన్నట్టు వార్తలొచ్చాయి. ప్రస్తుతం హిందీ సినిమాలు కూడా చేస్తున్న ఈ చిన్నది హోటల్ లో ఉండలేక ఏకంగా ఓ ఫ్లాట్ ను కొన్నట్టుగా మీడియాలో కథనాలు వచ్చాయి. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా అదే ఆలోచనలో వున్నట్టుగా తెలుస్తోంది.

ప్రస్తుతం ప్రభాస్ 'సలార్' సినిమాతో పాటుగా 'ఆదిపురుష్' సినిమా కూడా చేస్తున్నాడు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ముంబైలో మొదలైంది. రామాయణం ఆధారంగా రూపొందుతున్న ఈ భారీ చిత్రం కోసం అక్కడ సెట్స్ కూడా వేశారు. ప్రతి నెలలోను పదిహేను రోజుల పాటు అక్కడ ప్రభాస్ షూటింగులో పాల్గొంటాడు. దీంతో తాను హోటల్ లో ఉండలేక ఓ మంచి ఫ్లాట్ ను కొనుగోలు చేయాలని ఆయన నిర్ణయించుకున్నాడట.

ఈ క్రమంలో ప్రస్తుతం ప్రభాస్ టీమ్ అధునాతనమైన ఓ ఫ్లాట్ కోసం ముంబైలోని విలాసవంతమైన ప్రాంతంలో వెతుకుతోంది. త్వరలోనే ఫ్లాట్ కొనుగోలు చేయడం పూర్తవుతుందని అంటున్నారు. ఇక 'ఆదిపురుష్'లో ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా.. కృతి సనన్ సీతగా కథానాయిక పాత్ర పోషిస్తుందని తెలుస్తోంది.