Nara Lokesh: ఇన్ని దారుణాలు జరుగుతుంటే ఎన్నికల సంఘం ఏంచేస్తోంది?: నారా లోకేశ్

Nara Lokesh questions Election Commission over attacks on TDP leaders
  • తిరుపతిలో తమ నేతపై దాడి చేశారన్న లోకేశ్
  • వైసీపీ రౌడీలు షాపును ధ్వంసం చేశారని వెల్లడి
  • వైసీపీ దద్దమ్మల్లారా అంటూ ఆగ్రహం
  • చంద్రబాబుకు భయపడ్డారంటూ వ్యాఖ్యలు
ఏపీ మున్సిపల్ ఎన్నికల పర్వంలో ఓ కీలక ఘట్టం ముగిసింది. ఈ మధ్యాహ్నం 3 గంటల సమయానికి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయింది. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ లో ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తిరుపతి మున్సిపాలిటీ 45వ వార్డు కోసం టీడీపీ తరఫున చంద్రమోహన్ నామినేషన్ వేశారని తెలిపారు. అయితే చంద్రమోహన్ అభ్యర్థిత్వాన్ని బలపర్చిన టీడీపీ నేత గొల్ల లోకేశ్ నాయుడుపై వైసీపీ రౌడీలు దాడి చేశారని, ఆయన షాపును ధ్వంసం చేశారని నారా లోకేశ్ ఆరోపించారు. దీనికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజిని కూడా పంచుకున్నారు.

వైసీపీ దద్దమ్మల్లారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఎన్నికల్లో నిలబడి పోటీ చేసే దమ్ము లేని మీరు... ఈ భాగోతాలు బయటపడతాయనే కదా చంద్రబాబుకు భయపడి ఆయనను విమానాశ్రయంలో అడ్డుకున్నారు అంటూ విమర్శలు చేశారు. ఇన్ని దారుణాలు జరుగుతుంటే ఎన్నికల సంఘం ఏంచేస్తోంది? అని లోకేశ్ ప్రశ్నించారు.
Nara Lokesh
State Election Commission
Tirupati
TDP
Municipal Elections
Andhra Pradesh

More Telugu News