Jack Ma: చైనా కుబేరుల జాబితాలో నాలుగో స్థానానికి పడిపోయిన జాక్ మా

  • చైనా కుబేరుల జాబితా వెల్లడించిన హరూన్ గ్లోబల్
  • అగ్రస్థానంలో జాంగ్ షాన్ షాన్
  • రెండు, మూడు స్థానాల్లో పోనీ మా, కొలిన్ హువాంగ్
  • 2019, 2020లో అగ్రస్థానంలో జాక్ మా 
Jack Ma slips fourth place in China rich list

ఏడాది కిందట చైనాలో తిరుగులేని విధంగా వ్యాపార సామ్రాజ్యాన్ని శాసించిన అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా ఇప్పుడు తన అగ్రస్థానాన్ని కోల్పోయారు. హరూన్ గ్లోబల్ వెల్లడించిన చైనా కుబేరుల జాబితాలో జాక్ మా నాలుగో స్థానానికి పడిపోయారు. ప్రస్తుతం జాక్ మా కుటుంబ సంపద విలువ 55.64 బిలియన్ డాలర్లు. ఆయన కుటుంబ సంపద సంవత్సరకాలంలో 22 శాతం మేర పెరిగినా, ఇతర చైనా కుబేరుల సంపద పెరుగుదలతో పోల్చితే చాలా స్వల్పం.

జాక్ మాకు ఈ దుస్థితి రావడానికి ఆయన చేసిన వ్యాఖ్యలే కారణం. 2020 అక్టోబరు 24న జరిగిన ఓ సదస్సులో జాక్ మా మాట్లాడుతూ చైనా బ్యాంకుల తీరుతెన్నులను ఎండగట్టారు. చైనా బ్యాంకులు తాకట్టు దుకాణాల మనస్తత్వాలను వీడాలని పేర్కొన్నారు. చైనాలో బ్యాంకులు అత్యధికంగా ప్రభుత్వ అధీనంలోనే ఉంటాయి. సహజంగానే జాక్ మా వ్యాఖ్యలు చైనా ప్రభుత్వాన్ని ఆగ్రహానికి గురిచేశాయి.

అప్పటినుంచి జాక్ మా వ్యాపార కార్యకలాపాలపై చైనా గట్టి చర్యలు తీసుకుంది. ఆయన వ్యాపార ఎదుగుదలకు ఉపకరించే ప్రతి చర్యపైనా నిఘా ఉంచి అడ్డుకునే ప్రయత్నం చేసింది. 37 బిలియన్ డాలర్ల విలువ చేసే యాంట్ గ్రూప్ ఐపీవోను అడ్డుకోవడం ఈ కోవలోకే వస్తుంది. ఓ దశలో జాక్ మా కనిపించకుండా పోయారు. ఆ తర్వాత ఓ వీడియో కాన్ఫరెన్స్ లో కనిపించినా, మునుపటి వ్యాపార జోరు కనిపించలేదు. 2019, 2020లో చైనా కుబేరుల జాబితాలో అగ్రస్థానం అలంకరించిన జాక్ మా క్రమంగా ప్రాభవం కోల్పోయారు.

అదే సమయంలో చైనాలో నాంగ్ ఫూ స్ప్రింగ్ సంస్థ అధినేత జాంగ్ షాన్ షాన్ అనూహ్యరీతిలో సంపదను పోగేశారు. గత ఏడాది వ్యవధిలో జాంగ్ సంపద 85 బిలియన్ డాలర్లకు చేరింది. హరూన్ గ్లోబల్ చైనా కుబేరుల జాబితాలో ఇప్పుడు అగ్రస్థానంలో ఉన్నది ఈయనే. ఆ తర్వాత రెండు, మూడు స్థానాల్లో టెన్సెంట్ హోల్డింగ్స్ అధినేత పోనీ మా (70 శాతం పెరుగుదలతో 74.19 బిలియన్ డాలర్ల సంపద), పిన్ డ్యువోడ్యువో ఈ-కామర్స్ సంస్థ అధినేత కొలిన్ హువాంగ్ (283 శాతం పెరుగుదలతో 69.55 బిలియన్ డాలర్లు) ఉన్నారు.

More Telugu News