బాలీవుడ్​ డైరెక్టర్​ అనురాగ్​ కశ్యప్​, తాప్సీ ఇళ్లపై ఐటీ దాడులు

03-03-2021 Wed 14:15
  • నిర్మాత మధు మంతెన, వికాస్ బల్ ఇళ్లలోనూ సోదాలు
  • ముంబై, పూణెలోని 22 చోట్ల సోదాలు చేస్తున్న అధికారులు
  • ఫాంటమ్ పన్ను ఎగవేత కేసులో ఆదాయ పన్ను అధికారుల చర్యలు
IT raids at Taapsee Anurag Kashyap Madhu Mantenas homes

బాలీవుడ్ టాప్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్, హీరోయిన్ తాప్సీ పన్ను ఇళ్లు, ఆఫీసులపై ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. వారితో పాటు నైపుణ్య నిర్వహణ సంస్థ క్వాన్ ను నడుపుతున్న మధు మంతెన, వికాస్ బల్ ఇళ్లు, కార్యాలయాల్లోనూ సోదాలు చేశారు.

అనురాగ్ ఏర్పాటు చేసిన ఫాంటమ్ ఫిల్మ్స్ అనే నిర్మాణ సంస్థ పన్నులు ఎగ్గొట్టిన కేసులో.. బుధవారం ముంబై, పూణెలోని 22 చోట్ల అధికారులు సోదాలు చేశారు. ప్రస్తుతం ఐటీ అధికారుల సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.

ఫాంటమ్ తో సంబంధమున్న వ్యక్తులే లక్ష్యంగా దాడులు చేశారు. కాగా, 2011లో విక్రమాదిత్య మోత్వానీ, మధు మంతెన, వికాస్ బల్ తో కలిసి ఫాంటమ్ ఫిల్మ్స్ ను అనురాగ్ కశ్యప్ ఏర్పాటు చేశారు. అయితే, 2018లో వికాస్ బల్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం, ఆయనపై కేసు నమోదు కావడంతో సంస్థను మూసేశారు. కాగా, సమయం వచ్చినప్పుడల్లా కేంద్ర ప్రభుత్వంపై అనురాగ్ కశ్యప్, తాప్సీ పన్ను గళమెత్తారు. ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించారు.