ఆ రెండు ఎకరాలు విశాఖలో ఎక్కడున్నాయో చూపిస్తే జగన్ పేరు మీద రాసేస్తా: బుద్ధా వెంకన్న

02-03-2021 Tue 19:27
  • విశాఖలో విజయసాయి ఎన్నికల ప్రచారం
  • బుద్ధాపై భూ కబ్జా ఆరోపణలు
  • బంధువుల సాయంతో రెండెకరాలు ఆక్రమించారని వెల్లడి
  • ఆరోపణలను ఖండించిన బుద్ధా
  • ఆధారాలు చూపిస్తే ఆ భూమిని ఇచ్చేస్తానని ఆఫర్
Budha Venkanna condemns Vijayasai Reddy allegations

విశాఖలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొంటున్న వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నపై వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఎక్కడో కృష్ణా జిల్లా విజయవాడలో ఉండే బుద్ధా వెంకన్నకు విశాఖలో ఏం పని? తన బంధువుల సాయంతో ఇక్కడ రెండెకరాలు ఆక్రమించాడు అని ఆరోపించారు. దీనిపై బుద్ధా వెంకన్న స్పందించారు.

విశాఖలో తాను రెండెకరాల భూమిని కబ్జా చేశానని ఎన్నికల ప్రచారంలో విజయసాయి ఆరోపించారని వెల్లడించారు. అయితే ఆ రెండెకరాలు ఎక్కడ ఉన్నాయో చూపిస్తే ఆ రెండెకరాలను జగన్ పేరు మీద, లేక వైసీపీ పేరు మీద రాయడానికి సిద్ధమని సవాల్ విసిరారు. ఆధారాలు మీడియాకు చూపించండి... రెండెకరాలు తీసుకోండి అంటూ ఆఫర్ ఇచ్చారు. మీ భూదాహానికి రెండెకరాలు చిన్న విషయమే అయినా ఆధారాలు చూపిస్తే చిరు కానుకగా ఇవ్వడానికి సిద్ధమని బుద్ధా వెంకన్న ప్రకటించారు.