AP High Court: మున్సిపల్ ఎన్నికలకు మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలంటూ దాఖలైన రిట్ పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు

High Court dismiss writ petitions seeking fresh notification for municipal elections
  • ఏడాది కిందట నిలిచిన స్థానిక ఎన్నికల ప్రక్రియ
  • పాత నోటిఫికేషన్ ను కొనసాగిస్తూ ఈ నెల 10న ఎన్నికలు
  • ఎస్ఈసీ నిర్ణయంపై హైకోర్టులో రిట్ పిటిషన్లు
  • అప్పటికీ, ఇప్పటికీ మార్పులు వచ్చాయన్న పిటిషనర్లు
  • పాత నోటిఫికేషన్ కొనసాగింపు నిబంధనలకు విరుద్ధమని వాదన 

ఏపీలో సంవత్సరం కిందట స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఆగిపోయిన సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తితో ఆగిపోయిన మున్సిపల్ ఎన్నికలను ఈ నెల 10న నిర్వహించేందుకు ఎస్ఈసీ నిర్ణయించారు. అయితే, మున్సిపల్ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలంటూ ఏపీ హైకోర్టులో అనేక రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై న్యాయస్థానం నేడు విచారణ చేపట్టింది.

పాత నోటిఫికేషన్ ప్రకారమే ఎన్నికలు జరుపుతున్నారని, అప్పటికీ ఇప్పటికీ ఎన్నో మార్పులు వచ్చాయని పిటిషనర్లు వాదించారు. ఏడాది కిందట ఇచ్చిన నోటిఫికేషన్ ను ఇప్పటికీ కొనసాగించడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. కరోనా ప్రభావంతో సామాజిక మార్పులు జరిగాయని వివరించారు. అయితే ఎన్నికలు నిర్వహించాలంటూ ఇప్పటికే సింగిల్ బెంచ్ ఉత్తర్వులు ఇచ్చి ఉండడంతో ఆ రిట్ పిటిషన్లను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. ఎన్నికలు యథావిధిగా జరుగుతాయని పేర్కొంది.

అటు, వలంటీర్లపై ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ ముగిసింది. తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. విచారణ సందర్భంగా ఎస్ఈసీ తరఫు న్యాయవాది స్పందిస్తూ.... వలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ వరకు ఎలాంటి ఇబ్బందిలేదన్నారు. అయితే, రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకే వలంటీర్లపై చర్యలు ప్రకటించామని వివరణ ఇచ్చారు. లబ్దిదారులను బెదిరిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయని వివరించారు. ఓటరు స్లిప్పుల పంపిణీలో వలంటీర్ల జోక్యంపై ఫిర్యాదులు అందాయని వెల్లడించారు.

  • Loading...

More Telugu News