కూలీలతో కలిసి తేయాకు కోసిన ప్రియాంక గాంధీ

02-03-2021 Tue 13:53
  • అసాం సధారు టీ ఎస్టేట్ లో కూలీలతో మమేకం
  • వారి బాగోగులు, కష్ట సుఖాలు తెలుసుకున్న కాంగ్రెస్ నేత
  • వారి పనిలో నిజాయతీ, నిరాడంబరత వున్నాయని ప్రశంస
Priyanka Gandhi Plucks Tea Leaves Along with workers in Assom

తేయాకు తోటల్లో పనిచేసే కూలీల స్థితిగతులను కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ తెలుసుకునే ప్రయత్నం చేశారు. త్వరలో ఎన్నికలు జరగనున్న అసోంలో ఆమె పర్యటించారు. బిశ్వనాథ్ లోని సధారు టీ ఎస్టేట్ లోని తేయాకు తోటలకు వెళ్లారు. తేయాకును సేకరించే కూలీలతో మాట్లాడారు. వారితో కలిసి తేయాకును కోశారు.

కాసేపు వారితో కూర్చుని సరదాగా మాట్లాడారు. వారి ఆచార వ్యవహారాలు, సాధకబాధకాలను తెలుసుకున్నారు. ఆ విశేషాలను ఆమె తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. తేయాకు కూలీలు అందించిన ప్రేమాభిమానాలను ఎన్నటికీ మరువబోనన్నారు.

‘‘తేయాకు తోటల్లోని కూలీల పనిలో నిజాయతీ, నిరాడంబరత వున్నాయి. వారి పని దేశానికి ఎంతో విలువైనది. అలాంటి విలువైన వారితో ఈరోజు నేను మమేకమయ్యాను. వారి పని, వారి మంచి చెడ్డలను అడిగి తెలుసుకున్నాను. వారి కష్టాలేంటో తెలుసుకున్నాను. వారు చూపించిన ప్రేమాభిమానాలను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను’’ అని ట్వీట్ చేశారు.