Venkaiah Naidu: త‌న అర్ధాంగికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ వెంకయ్య నాయుడు భావోద్వేగ‌భ‌రిత లేఖ‌

venkaiah writes letter to his wife
  • అర్ధాంగి లక్ష్మీ ఉషమ్మకు.. అంటూ లేఖ
  • ఐదుపదులకు మించిన జీవితాన్ని త‌న కోసమే కేటాయించార‌న్న వెంక‌య్య‌
  • 'ఓ ప్రియసఖీ నీకు జన్మదిన శుభాకాంక్షలు' అని లేఖ‌
  • పిల్లలను ఆమే ప్రయోజకులను చేశార‌ని భావోద్వేగం
త‌న జీవిత భాగస్వామి ఉషకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆమెకు ఓ లేఖ రాశారు. 'అర్ధాంగి లక్ష్మీ ఉషమ్మకు..' అంటూ ఆయ‌న ఈ లేఖ రాసి ప‌లు విష‌యాల‌ను గుర్తు చేసుకున్నారు. ఆమె 66 ఏళ్ల‌ జీవితంలో నేటికి ఐదుపదులకు మించిన జీవితాన్ని త‌న కోసం, త‌మ‌ కుటుంబం కోసం వెచ్చించార‌ని చెప్పారు.

ఆమె ప్రేమ, సహనం, ఆప్యాయత, అవ్యాజానురాగం అనిర్వచనీయమైనవని వెంక‌య్య నాయుడు పేర్కొన్నారు. జన్మదినమిదమ్ అయి, ప్రియసఖీ శం తనోతు తే సర్వదా ముదమ్.. ప్రార్థయామహే భవ శతాయుషీ ఈశ్వరః సదా త్వాం చ రక్షతు.. పుణ్య కర్మణా కీర్తిమర్జయ జీవనం తవ భవతు సార్థకమ్ అనే శ్లోకాల‌ను ఆయ‌న పేర్కొన్నారు.

అంటే ఓ ప్రియసఖీ, నీకు జన్మదిన శుభాకాంక్షలు.. నీకు ఎల్లప్పుడూ శుభమగుగాక.. దేవుడు నిండు నూరేళ్లు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాన‌ని వెంక‌య్య నాయుడు చెప్పారు. దేవుడు నిన్ను ఎల్లప్పుడూ రక్షించాలి,  పుణ్యకర్మలాచరించి, కీర్తిని సంపాదించి, జీవితాన్ని మరింత సార్థకం చేసుకోవాల‌ని ఆశిస్తున్నాన‌ని చెప్పారు.  

త‌మ‌ వివాహం నాటికి ముందు నుంచే, త‌న‌ జీవితం ప్రజలతో పెనవేసుకుపోయిందని వెంక‌య్య నాయుడు ఈ సంద‌ర్భంగా చెప్పారు. ఆ తర్వాత ప్రజలనే తప్ప, కుటుంబాన్ని పట్టించుకున్నది చాలా తక్కువని త‌న భార్యకు బాగా తెలుసని అన్నారు.

అయినప్పటికీ పిల్లలను ఆమె ప్రయోజకులను చేయడమే గాక వారి బాధ్యతను కూడా తీసుకున్నార‌ని గుర్తు చేసుకున్నారు. భారతీయ కుటుంబ వ్యవస్థకు చిరునామాగా త‌మ‌ కుటుంబాన్ని తీర్చిదిద్దారని చెప్పారు. తాను చిన్నతనంలోనే అమ్మను కోల్పోయాన‌ని, త‌న అర్ధాంగి అమ్మ‌ అంతటి అనురాగాన్ని అందించార‌ని తెలిపారు. ఇలాంటి పుట్టినరోజులను ఆమె మరెన్నో జరుపుకోవాలని ఆయ‌న ప్రార్థించారు.
Venkaiah Naidu
India
letter

More Telugu News